ఇదివరకు సంగీతం అంటే కొన్ని లెక్కలుండేవి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లెక్కల్ని అధిగమించేవారు కాదు, పాటల రచయితలు, కానీ గాయకులు కానీ.. మరి ఇప్పుడు అలా కాదు, వెస్ట్రన్ సంగీతం వెలుగులోకి వచ్చింది. దీనికి ఏదీ అతీతం కాకుండా పోయింది. ఇంగ్లీష్, హిందీతో పాటు రకరకాల భాషల పదాలు తెలుగు పాటలో మిక్సింగ్ అయిపోతున్నాయ్. తెలుగు సంగీతానికే వెస్ట్రన్ ఫ్లేవర్‌ని మిక్స్ చేసి రంగులు అద్దేస్తున్నారు. అయితే మళ్లీ ఇప్పుడు ట్రెండ్ మారింది. తెలుగు సంగీతానికి, సాంప్రదాయాలకి విలువిస్తున్నారు. ట్రెడిషనల్ మ్యూజిక్‌పై ఫోకస్ ఎక్కువ పెడుతున్నారు. ఇది మంచి పరిణామమే. తాజాగా యంగ్ హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సినిమా 'కేశవ'లో ఓ పాట ఉంది. అది కాలభైరవాష్టకమ్. లింగాష్టకమ్, బిల్వాష్టకమ్ గురించి అందరికీ ఈజీగా తెలుసు. కానీ కాలభైరవాష్టకమ్ గురించి ఎవ్వరికీ పెద్దగా తెలీదు. 'కేశవ' సినిమా ఆడియోలో 'కాల భైరవాష్టకమ్' పెట్టి మంచి పని చేశారు. ఈ పాట భలే పాపులర్ అయ్యింది. పిల్లలు ఎక్కువగా ఎట్రాక్ట్ అవుతున్నారు ఈ పాటకి. పుస్తకాల్లో చదువుకోవడం కన్నా, చెవులకి వినసొంపైన మ్యూజిక్‌తో వింటే ఆ కిక్కే వేరు. కిక్కుతో పాటు, ఓ రకమైన అనుభూతి కూడా కలుగుతుంది. అదే ఇప్పుడు ఈ పాట విషయంలో జరుగుతోంది. గతంలో 'మహిషాషుర మర్దిని' స్తోత్రాన్ని చాలా సినిమాల్లో దుష్ట శిక్షణ జరుగుతున్న సందర్భాల్లో ఉపయోగించారు. బ్యాక్ గ్రౌండ్‌లో ఆ పాట ఉంటే ఆ సీన్ తెరపై మరింత రక్తి కడుతుంది. అలాగే ఈ సినిమా కోసం డైరెక్టర్ కాలభైరవాష్టకమ్‌ని ఉపయోగించాడు. ఏ సందర్భంలో దీన్ని ఉపయోగించాడో తెలీదు కానీ ఈ పాట అయితే సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది.