'లీడర్' సినిమాతో కూల్‌గా హీరో ఎంట్రీ ఇచ్చిన రానా ఇప్పుడు యూనివర్సల్ స్టార్ అయిపోయాడు. ఇదంతా రానాకి 'బాహుబలి' సినిమా తెచ్చి పెట్టిన స్టార్‌డమే. అయితే స్టార్‌డమ్ విషయంలో అస్సలు నమ్మకం లేదంటున్నాడు రానా. స్టార్‌డమ్ తెచ్చుకోవడం కన్నా, మంచి నటుడు అనిపించుకోవడమే గొప్ప అంటున్నాడు. దగ్గుబాటి రానా అన్న గుర్తింపు కన్నా 'భళ్లాలదేవ' అన్న గుర్తింపే బాగుందంటున్నాడు కూడా. ఒక పాత్ర పేరుతో ఆ వ్యక్తిని గుర్తించడం అంటే ఆ పాత్ర జనంలో ఎంతగా ప్రాధాన్యత పొందిందో అర్ధం చేసుకోవచ్చు. అంత కన్నా మంచి గుర్తింపు ఇంకెక్కడ దొరుకుతుందంటున్నాడు. వయసుతో సంబంధం లేకుండా ఎవ్వరి నోట విన్నా 'భళ్లాలదేవ' పేరుకు బోలెడంత పాపులారిటీ ఉంది. మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా 'బాహుబలి' సినిమా గురించి మాట్లాడుకోవడం చాలా గర్వంగా ఉందంటున్నాడు దగ్గుబాటి బుల్లోడు రానా. నాటి తరంలో రావణాసురుడు, దుర్యోధనుడు పాత్రలకి విలన్స్‌గా ఎంత పాపులారిటీ ఉందో అంత పాపులారిటీని ఇప్పుడు రానా భళ్లాలదేవ పాత్ర ద్వారా పొందాడు. చిన్నప్పట్నుంచీ ఆ పాత్రలంటే చాలా ఇష్టమట రానాకి. ఆ పాత్రల స్పూర్తే తనని భళ్లాలదేవ పాత్రలో ఇంతగా ఒదిగిపోవడానికి ప్రేరణనిచ్చాయంటున్నాడు. 'బాహుబలి' సినిమా తర్వాత రానా నుండి వస్తోన్న చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి'. తేజ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న చిత్రమిది. 'బాహుబలి ది బిగినింగ్' తర్వాత వచ్చిన 'ఘాజీ' సినిమా సక్సెస్ అయ్యింది. అలాగే రానా తాజా చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాపై కూడా అంచనాలున్నాయి.