పెద్దా, చిన్నా అనే తేడాలేకుండా సినిమాలన్నీ ఇప్పుడు ఓటీటీ వైపు ఆశ గా చూస్తున్నాయి. మే 3న లాక్ డౌన్ ఎత్తేస్తే ఫర్వాలేదు. కానీ ఆ తరవాత కూడా కొనసాగితే మాత్రం ఓ టీ టీ మినహా సినిమాలకు మరో మార్గం లేకపోవొచ్చు. ఇటీవలే `అమృతరామమ్` అనే చిన్న సినిమా ఓటీటీలో విడుదలైంది. ఆ సినిమా ఎలా ఉన్నా... ఓటీటీలో చూస్తున్నవారి సంఖ్య ఎక్కువ అవుతోంది. అదే.. కాస్త స్టార్ కాస్ట్ ఉన్న సినిమా అయితే.. ఆ రేంజు మరోలా ఉంటుంది. దాన్ని గమనించిన ఓటీటీ సంస్థలు - ఇప్పుడు పెద్ద సినిమాల్ని లాగడానికి భారీ ఎత్తున ప్రయత్నిస్తున్నాయి. వాళ్ల దృష్టి అనుష్క `నిశ్శబ్దం`పై పడింది.
ఏప్రిల్ లో విడుదల కావాల్సిన సినిమా ఇది. కానీ.. లాక్ డౌన్ వల్ల వీలు పడలేదు. ఈ సినిమా కొనాలని అమేజాన్, హాట్ స్టార్ లాంటి సంస్థలు ప్రయత్నించాయి. అయితే ఓటీటీకి అమ్మడానికి నిర్మాతలు ఒప్పుకోలేదు. ఇప్పుడు లాక్ పెరిగితే మాత్రం ఈ సినిమాని ఓటీటీకి అమ్ముకోక తప్పదు. అందుకే దర్శక నిర్మాతలు కూడా కాస్త మెత్తబడినట్టు తెలుస్తోంది.
ఓటీటీలో సినిమాని ప్రదర్శించుకోవడానికి తామేమీ వ్యతిరేకం కాదని. అయితే లాక్ డౌన్ తరవాత పరిస్థితుల్ని అంచనా వేసి, ఓ నిర్ణయానికి వస్తామని, తమ సినిమా కొనడానికి ఓటీటీ సంస్థలు ఆసక్తి చూపించాయని, అయితే ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదని దర్శకుడు హేమంత్ మధుకర్ తేల్చేశారు. అనుష్క కూడా ఈ విషయంలో దర్శక నిర్మాతలకు సపోర్ట్ చేస్తోందని, సినిమాలోనే రిలీజ్ చేయాలని అనుష్క ఏమీ పట్టుపడడం లేదని చెప్పుకొచ్చారు హేమంత్. సో.. నిశ్శబద్దం... సెలైంట్ గా ఓటీటీలో వచ్చేస్తోందన్నమాట.