పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు ప్రభాస్. తన నుంచి ఓ సినిమా వస్తోందంటే దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అలాంటి ప్రభాస్, అమీర్ ఖాన్ తో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది? అదిరిపోతుంది కదూ. బహుశా ప్రభాస్ కూడా ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాడేమో. మరి ప్రభాస్‌నీ, అమీర్ నీ కలిపేదెలా? అది సాధ్యం అవుతుందా? - వారిద్దరినీ కలిపే శక్తిమంతమైన కథ కావాలి కదా? అలాంటి కథ తన దగ్గర ఉంది అంటున్నాడు స్వరూప్. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో విమర్శకుల్ని ఆకట్టుకున్నాడు ఈ యువ దర్శకుడు.
ఇప్పుడు తన చేతిలో ఎన్ని అవకాశాలో. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయకు సీక్వెల్ చేసే పనిలో ఉన్నాడు స్వరూప్. తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ప్రభాస్,అమీర్ ఖాన్‌లతో ఓ సినిమా చేయాలని, అలాంటి కథ తన దగ్గర ఉందని, అయితే ఆ కల ఎప్పుడు పూర్తవుతుందో తనకు తెలీదని అంటున్నాడు. ఆలోచన బాగానే ఉంది. ఆచరణ కూడా ఏమంత కష్టం కాదు. ఈరోజుల్లో యువ దర్శకులు స్టార్ లతో తొందరగానే పనిచేయగలుతున్నారు. సుజిత్ కి ప్రభాస్ ఛాన్సిచ్చాడు కదా? స్వరూప్ విషయంలోనూ అదే జరగొచ్చు. ఈ సీక్వెల్ ని హిట్ చేస్తే.. ప్రభాస్ నుంచి పిలుపు రావడం పెద్ద పనేం కాదు. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.