నిశ్శబ్దం సినిమా ఓటీటీలోకి విడుదల కాబోతోందని వార్తలు రావడం, వాటిని చిత్రబృందం ఖండించడం షరా మామూలైపోయింది. అయితే... ఈసినిమా ఓటీటీ విడుదలకు సన్నాహాలు పూర్తయ్యాయని ఇటీవల మరో వార్తపుట్టుకొచ్చింది. ఈసారి మాత్రం చిత్ర బృందం ఈ విషయంపై నిశ్శబ్దంగానే ఉంది. ఊహాగానాలను నిజం చేస్తూ.. ఇప్పుడు ఓటీటీ విడుదలకు రెడీ అయిపోయింది ఈ చిత్రం. అక్టోబరు 2న ఈ చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్ లో విడుదల చేస్తున్నారన్నది అధికారిక సమాచారం.
అమేజాన్ ప్రైమ్ ఈ చిత్రాన్ని దాదాపు 25 కోట్లకు కొనుగోలు చేసింది. అక్టోబరు 2నే తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమిది. కోన వెంకట్ నిర్మాత. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. వేసవిలో విడుదల కావాల్సిన సినిమా ఇది. కరోనా కారణంగా వాయిదా పడింది. అప్పటి నుంచీ ఓటీటీ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. చివరికి అమేజాన్ లో ఇప్పుడు విడుదల కానుంది.