లాజిక్కుల కథలు అల్లి, అలాంటి సన్నివేశాలు తెరకెక్కించి, ప్రేక్షకుల్ని కన్‌ఫ్యూజ్ చేయడంలో దిట్ట... సుకుమార్. అయితే.. ఇప్పుడు తనకు తానే కన్‌ఫ్యూజ్ అయి, నిర్మాతల్నీ, హీరోనీ కన్‌ఫ్యూజ్‌లోకి నెడుతున్నాడని ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం `పుష్ష`. అల్లు అర్జున్ కథానాయకుడు. రష్మిక నాయిక. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ మొదలవ్వాల్సింది. బన్నీ రెడీగా ఉన్నాడు. రష్మిక కూడా ఓకే. కానీ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి ఆలస్యం అవుతోంది. దానికి కారణం సుకుమార్ తీసుకుంటున్న కన్‌ఫ్యూజ్ నిర్ణయాలే అని తెలుస్తోంది. సుకుమార్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్. రాసిన సీనే మళ్లీ రాస్తుంటాడు. పర్‌ఫెక్షన్ కోసం. సెట్లో కూడా రాసుకున్న సీన్ కి రిపేర్లు చేస్తుంటాడు. ఇదంతా మంచి అవుట్ పుట్ రావడానికే అని నిర్మాత, హీరో లైట్ తీసుకుంటారు.కానీ. అదే ఇప్పుడు కొంప ముంచుతోంది.
సెట్స్ , లొకేషన్ల ఎంపికలోనూ ఇలాంటి అతి జాగ్రత్తల వల్లే ఈసినిమా ఆలస్యం అవుతోందని సమాచారం. షూటింగ్ మొదలు పెట్టమని బన్నీ చెప్పినా సరే, సుకుమార్ ఈ సినిమా షూటింగ్ ని మొదలెట్టలేదు. దానికి కారణం... ఇంత వరకూ లొకేషన్లని ఫైనలైజ్ చేయకపోవడమే అని తెలుస్తోంది. మారేడుమల్లి అని కాసేపు, నిజామాబాద్ అడవులు అని కాసేపు, కేరళ అని కాసేపు.. ఇలా లొకేషన్లు మార్చి మార్చి కన్‌ఫ్యూజ్ అవుతున్నాడని, దాంతో మిగిలిన యూనిట్ కూడా అదే గందరగోళంలో కొట్టిమిట్టాడుతోందని తెలుస్తోంది. దాంతో బన్నీ కూడా కాస్త అసంతృప్తిగానే ఉన్నాడని టాక్ వినిపిస్తోంది. మరి ఈ లెక్కల మాస్టారు కన్‌ఫ్యూజన్‌కి ఎప్పుడు తెర పడుతుందో? పుష్ష ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందో?