నిశ్శబ్దం సినిమాని ఓ టీ టీ కి అమ్మేశారని, థియేటర్లో కాకుండా నేరుగా ఓ టీ టీలోనే ఈ సినిమా విడుదల అవుతుందని వార్తలు వినిపించాయి. థియేటర్ల మూత వల్ల నిశ్శబ్దం టీమ్‌కి అంత కంటే మరో ఆప్షన్ లేకుండా పోయింది. అయితే.. ఇప్పుడు ఓ టీ టీకి సినిమాని ఇవ్వడం విషయంలో చిత్రబృందం మళ్లీ వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాని థియేటర్లలోనే విడుదల చేస్తామని కోన వెంకట్ తాజాగా స్పష్టం చేశారు. తమ తొలి ప్రాధాన్యం థియేటర్లకే అని, అంతగా పరిస్థితులు అనుకూలించకపోతే... అప్పుడు ఓ టీ టీని ఆశ్రయిస్తామని చెప్పుకొచ్చారు.
జూన్‌లో షూటింగులు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే ఊపులో థియేటర్ల కూ పర్మిషన్లు ఇస్తుందని చిత్ర వర్గాలు ఆశతో ఉన్నాయి. అందుకే... ఓ టీ టీకి అమ్ముకుందామని చూసిన దర్శక నిర్మాతలు కూడా ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు. అందుకే నిశ్శబ్దం టీమ్ కూడా పునరాలోచనలో పడిందని సమాచారం.