థియేటర్లలో బొమ్మ ఎప్పుడు పడుతుందో తెలీదు. పడినా.. జనాలు వస్తారో, రారో ఎవ్వరికీ నమ్మకాల్లేవు. ఇలాంటి తరుణంలో ఓటీటీకి మించిన వేదిక చిత్రసీమకు లేదు. అందుకే.. మెల్లగా అటువైపుకు మెగ్గు చూపుతున్నాయి సినిమాలు. వీ, నిశ్శబ్దం, ఒరేయ్ బుజ్జిగా లాంటి సినిమాల్ని టార్గెట్ చేశాయి ఓటీటీ సంస్థలు. ఇప్పుడు మెల్లగా నిశ్శబ్దం సినిమా బేరం ఓకే అయిపోయిందని టాక్. అమేజాన్ ఈ సినిమాని 30 కోట్లకు కొనుగోలు చేసిందని వార్తలొస్తున్నాయి. అదే నిజమైతే తెలుగు సినిమాలకు సంబంధించినంత వరకూ ఓటీటీలో ఇది పెద్ద డీల్ కావొచ్చు.
అనుష్క, మాధవన్ లాంటి స్టార్లు ఉన్న సినిమా. పైగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. అన్ని భాషల్లోనూ ఈ సినిమాని డబ్ చేసి వదలొచ్చు. వ్యూవర్ షిప్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే అమేజాన్ అంత పెట్టుబడి పెట్టడానికి రెడీ అయ్యిందట. ఈనెలలోనే ఈ సినిమాని ఓటీటీలో చూడొచ్చని ఫిల్మ్ నగర్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. నిశ్శబ్దం సినిమా ఓకే అయిపోతే.. ఈ బాటలో నడవడానికి మరిన్ని సినిమాలు ఉత్సాహం చూపించే అవకాశం ఉంది.