నటీనటులు : అనుష్క శెట్టి, మాధవన్, అంజలి, షాలిని పాండే సుబ్బు రాజు తదితరులు
దర్శకత్వం : హేమంత్ మధుకర్
నిర్మాతలు : టీ.జీ. విశ్వ ప్రసాద్, కోన వెంకట్
సంగీతం : గోపి సుందర్
సినిమాటోగ్రఫర్ : శనియల్ డియో
ఎడిటర్: ప్రవీణ్ పుడి
రేటింగ్: 2.25/5
లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్స్ గా నిలిచింది అనుష్క. `భాగమతి` తరవాత తాను చేసిన సినిమా `నిశ్శబ్దం`. థియేటర్లలో విడుదల కావాల్సిన సినిమా ఇది. లాక్‌డౌన్ వల్ల... అది సాధ్యం కాలేదు. దాంతో... ఓటీటీ ముందుకొచ్చింది. అమేజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోందిప్పుడు. అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే - ఇలా స్టార్లకు కొదవ లేని సినిమా ఇది. మరి `నిశ్శబ్దం` ఎలా ఉంది..? అనుష్క రేంజ్ కి తగినట్టుగా ఉందా? ఓటీటీ అంటేనే ఫ్లాప్ సినిమానేమో అని భయపడుతున్న ప్రేక్షకులకు రిలీఫ్ ఇస్తుందా? ఆ సెంటిమెంట్ బ్రేక్ చేసిందా?
* కథ
సాక్షి (అనుష్క) మాట్లాడలేదు. వినిపించదు కూడా. కానీ అద్భుతమైన చిత్రకారిణి. తనలోని ప్రతిభకు ముగ్థుడైపోయిన ఆంటోనీ (మాధవన్) ఆమెని ఇష్టపడతాడు. క్రమంగా ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. సాక్షికి ఆప్తమిత్రురాలు సోనాలి (షాలినీ పాండే). సాక్షికి తాను కాకుండా ఇంకెవరు దగ్గరైనా తట్టుకోలేదు. ఓరకమైన ఈర్ష్య. అయితే సడన్ గా సోనాలీ కనిపించకుండా పోతుంది. మరోవైపు తాను వెదుకుతున్న ఓ పెయింటిగ్ హాంటెడ్ హౌస్ లో ఉందని తెలుసుకున్న సాక్షి, అందుకోసం ఆంటోనీని తోడుగా తీసుకెళ్తుంది. కానీ ఆ హాంటెడ్ హౌస్ అంటే అందరికీ భయమే. అక్కడ ఓ ఆత్మ సంచరిస్తోందని అందరి నమ్మకం. హాంటెడ్ హౌస్‌లో అడుగుపెట్టిన రోజే.. ఆంటోనీ హత్యకు గురవుతాడు. ఆంటోనీని హత్య చేసింది ఎవరు? నిజంగానే ఆ ఇంట్లో దెయ్యం ఉందా? లేదంటే శత్రువులెవరైనా ఉన్నారా? సోనాలీ ఏమైంది? ఈ మిస్టరీ ఎలా వీడింది? అనేదే కథ.
* విశ్లేషణ
హాంటెడ్ హౌస్ చరిత్ర చెబుతూ కథ మొదలవుతుంది. ఆ ఇంట్లో ఏదో ఉందన్న ఆసక్తిని కలిగించాడు దర్శకుడు. ఇది హారర్ సినిమానేమో అన్న భ్రమలో కాసేపు ఉంచాడు. అయితే ఆంటోనీ హత్య ఎప్పుడు జరుగుతుందో అప్పుడే ఇది హారర్ సినిమా కాదని అర్ధమైపోతుంది. నేరుగా కథలోకి వెళ్లిపోవడం, ఇన్వెస్టిగేషన్ మొదలైపోవడంతో - సోది లేకుండానే అసలు కథ మొదలైపోయిందనిపిస్తుంది. కానీ మెల్లమెల్లగా ఫ్లాష్ బ్యాక్‌లు మొదలవుతాయి. ముందుగా సాక్షి - ఆంటోనీ లవ్ స్టోరీ చూపిస్తాడు. ఆ తరవాత షాలినీ కథ. ఆ తరవాత... వివేక్ (సుబ్బరాజు) కథ. ఇలా... ముక్కలు ముక్కలుగా కథలు చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ ఫీల్ తగ్గుతుంది. అనుష్క సినిమానేమో అనుకున్న వాళ్లకు కాస్తషాక్ కలగక మానదు. ఎందుకంటే.. అనుష్క పాత్ర నిడివి మరీ అంత పెద్దదేం కాదు. కొన్నిసార్లు అంజలి, ఇంకొన్నిసార్లు షాలినీ పాండే స్క్రీన్ టైమ్ ని అనుష్క నుంచి లాగేసుకుంటారు.
ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లో మలుపులు చాలా అవసరం. అయితే ఈ సినిమాలో పెద్దగా మలుపులేం లేవు. ట్విస్టులు ఊహకు అతీతంగా సాగవు. థ్రిల్లర్‌సినిమాల్ని రెగ్యులర్ గా చూసేవాళ్లకు కథ అర్థమవుతూనే ఉంటుంది. ప్రతి సినిమాలోనూ కిల్లర్‌కి ఓ బ్యాక్ స్టోరీ ఉంటుంది. `వై.. వై` అంటూ కిల్లర్ చేసే హత్యల వెనుక కారణం.. చాలా బలహీనంగా ఏంది. ఏదో ఓ బ్యాక్ స్టోరీ పెట్టాలి కాబట్టి అది పెట్టారా? అనిపిస్తుంది. షాకిచ్చే సన్నివేశాలు, రోమాలు నిక్కబొడిచే సంఘటనలూ... ఏవీ నిశ్శబ్దంలో కనిపించవు. హాంటెడ్ హౌస్‌లో దెయ్యం ఎలిమెంట్ ని కాస్త వాడుకుని - దాని చుట్టూ కాస్త కథ నడిపినా బాగుండేది. తొలి సీన్లలో దెయ్యం ఉందన్న భ్రమలు కలిగించి (అవి కూడా రొటీన్ పాసింగ్ షాట్లే).. దాని గురించే మర్చిపోయాడు దర్శకుడు.
* నటీనటులు
అనుష్క సినిమా కాదిది. అందరూ తలా కాస్త భాగం పంచుకున్నారు. నిజానికి అనుష్కకి నటించే ఛాన్సే దక్కలేదు. పైగా చాలా బొద్దుగా కనిపించింది. అనుష్క కంటే అంజలి పాత్రనే కథ నడిపించింది. నిజానికి తన పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ కథ నడుస్తుంది. మాధవన్ స్క్రీన్ ప్రెజెన్స్ మరోసారి ఆకట్టుకుంటుంది. అవసరాల శ్రీనివాస్ ది చాలా చిన్న పాత్ర. అంజలికి ఓ జోడీ ఉండాలి కాబట్టి, ఆయన్ని తీసుకున్నారేమో అనిపిస్తుంది. సుబ్బరాజు మాత్రం లుక్ వైజ్ ఆకట్టుకుంటాడు.
* సాంకేతిక వర్గం
ఈ చిత్రానికి కథ అందించి, నిర్మాతగా వ్యవహరించారు కోన వెంకట్. ఆయన రాసుకున్న కథ చాలా సాదా సీదాగా ఉంది. మలుపులూ పెద్దగా కనిపించవు. డైలాగుల్లో మెరుపుల్లేవు. అమెరికా నేపథ్యంలో సాగే కథ కాబట్టి.. పాత కథకు కాస్త కొత్త లుక్ వచ్చింది. పాటలు కథకు మరింత బ్రేక్ వేస్తాయి. ఫొటోగ్రఫీ, సౌండ్ క్వాలిటీ బాగున్నాయి. క్లైమాక్స్‌లో ఏదో ఊహించని ట్విస్టు వస్తుందనుకుంటే.. ప్రేక్షకుల ఊహకు అనుగుణంగానే కథని నడిపి నిరాశకు గురి చేశాడు దర్శకుడు.
* ప్లస్ పాయింట్స్
స్టార్లు
అమెరికా నేపథ్యం
* మైనస్ పాయింట్స్
పేలమైన స్క్రీన్ ప్లే
మలుపులు లేకపోవడం
* ఫైనల్ వర్డిక్ట్: వై.. అనుష్క... వై..