కరోనా కాలం ఇది. పరిస్థితులన్నీ మారిపోయాయి. ఇది వరకు విదేశాల్లో షూటింగ్ అంటే అనుమతులు ఈజీగా వచ్చేసేవి. అప్పుడు అలా కాదు. సవాలక్ష ఆంక్షలు విధిస్తున్నారు. అనుమతులు ఇచ్చినా, షూటింగు చేసే పరిస్థితి లేదు. ప్రస్తుతం ప్రభాస్ సినిమా `రాధే శ్యామ్`కి అలాంటి ఆటంకాలే ఎదురవుతున్నాయి. `రాధే శ్యామ్` కథ ప్రకారం ఇటలీలోనే షూటింగ్ మొత్తం సాగాలి. అక్కడ కొంత మేర షూటింగ్ చేశారు.
ఇండోర్‌కి సంబంధించిన షూటింగ్ అంతా.. హైదరాబాద్‌లోనే తీశారు. అందుకోసం.. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకమైన సెట్లు వేశారు. కరోనా తరవాత.. ఇటీవలే ఇటలీలో షూటింగ్ మొదలైంది. అక్కడ దాదాపు 40 శాతం షూటింగ్ బాకీ. అవన్నీ ఇటలీలో పూర్తి చేసి, ఇండియాకి తిరిగొద్దామన్నది ప్లాన్. కానీ... ఇటలీలో పరిస్థితులు షూటింగులకు అనుకూలంగా లేవట. అక్కడ దిన దిన గండం.. నూరేళ్ల ఆయుష్షు అన్నట్టు పరిస్థితులు ఉన్నాయట.
చాలా ఏరియాల్లో అనుమతులు ఇవ్వడం లేదని అక్కడ పూర్తిగా కర్ఫ్యూ వాతావరణం ఉందని తెలుస్తోంది. అందుకే రాధే శ్యామ్ షూటింగ్ అనుకున్నంత వేగంగా సాగడం లేదని తెలుస్తోంది. ఏదోలా అక్కడ షెడ్యూల్ పూర్తి చేసి, వీలైనంత త్వరగా ఇండియా తిరిగి వచ్చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ప్రభాస్ సినిమా పరిస్థితి చూసి, మిగిలినవాళ్లు ఇటలీ అంటే భయపడుతున్నారు.
నిజానికి నితిన్ `రంగ్ దే` కూడా ఇటలీలోనే ఓ షెడ్యూల్ జరుపుకోవాలి. ఈ నెలాఖరున చిత్రబృందం ఇటలీ వెళ్లాలి. కానీ రాధే శ్యామ్ అనుభవాలు చూస్తున్న నితిన్... ఇప్పుడు ఇటలీలో షూటింగ్ వద్దని చెబుతున్నాడట. ఆ సన్నివేశాల్ని వేరే దేశాల్లో పూర్తి చేయాలని దర్శక నిర్మాతలు అనుకుంటున్నార్ట. ఇటలీనే కాదు, కొన్నాళ్ల పాటు.. సినిమా షూటింగుల కోసం విదేశాలకు వెళ్లకపోవడమే బెటర్.