`ఆర్.ఆర్.ఆర్`లో కొమరం భీమ్ పాత్రని ఇటీవలే అభిమానులకు పరిచయం చేశారు రాజమౌళి. టీజర్‌లో కనిపించిన విజువల్స్, ఎన్టీఆర్‌లోని ఫైర్ చూసి.. ఫ్యాన్స్ తెగ సంబర పడుతున్నారు. వెండి తెరపై ఎన్టీఆర్ పాత్రని ఓ రేంజులో ఊహించుకుంటున్నారు. అయితే.. ఇప్పుడు ఇదే టీజర్ కొత్త వివాదాల్ని సృష్టిస్తోంది. ఈ టీజర్‌లోని చివరి షాట్‌లో ఎన్టీఆర్ ని ఓ ముస్లింగా చూపించాడు రాజమౌళి. దాంతో... కొమరం భీమ్ చరిత్రని రాజమౌళి ఖూనీ చేస్తున్నాడని, చరిత్రని వక్రీకరిస్తున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇప్పుడు వాటికి రాజకీయ రంగూ పులుముతున్నారు.
రాజమౌళి చరిత్రని వక్రీకరిస్తే ఊరుకోమని ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ బాపూరావు హెచ్చరిస్తున్నారు. కొమరం భీమ్ కి ఇతర మతాలతో సంబంధం పెట్టడం చరిత్రని అవమానించడం అని, ఆ సన్నివేశాల్ని తక్షణం తొలగించి, రాజమౌళి క్షమాపణలు చెప్పాలని, లేదంటే.. ఈ సినిమా విడుదలను, చిత్రీకరణను అడ్డుకంఉటామని హెచ్చరించారు. తమ మాటల్ని పెడ చెవిన పెడితే.. థియేటర్ల దగ్గర నిరసన వ్యక్తం చేస్తామని కూడా అన్నారు. టీజర్ కే ఇంత గొడవ జరుగుతోందంటే... సినిమా విడుదలకు ముందు... ఈ వివాదం ఎలాంటి టర్న్ తీసుకుంటుందో అని నందమూరి అభిమానులు భయపడుతున్నారు. వీటిపై రాజమౌళి ఓ క్లారిటీ ఇస్తే బాగుంటుంది.