ఏ సినిమా చేయాలి? ఏది వదులుకోవాలి? అనే నిర్ణయం తీసుకోవడం చాలా క్లిష్టమైన విషయం. ఆ నిర్ణయాలే కెరీర్ ని డిసైడ్ చేస్తాయి. కొన్నిసార్లు అతి జాగ్రత్తకు పోయి, హిట్ కాదల్ని వదిలేసుకుంటారు హీరోలు. ఇంకొన్నిసార్లు... ఓవర్ కాన్ఫిడెన్స్ తో.. యావరేజ్ కథల్ని ఓకే చేసి, ఫ్లాపులు తెచ్చుకుంటారు. అలా నితిన్‌కి ఓ ఫ్లాప్ మిస్ అయ్యింది. ఓ తెలివైన నిర్ణయంతో ఓ పరాజయం నుంచి తప్పించుకున్నాడు.
ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో.. హీరో ఒకటి. గల్లా అశోక్ హీరోగా పరిచయం అయ్యాడు. గల్లా జయదేవ్ కుమారుడు కావడం, మహేష్ బాబు బ్యాక్ గ్రౌండ్ ఉండడంతో ఈ సినిమా పై అందరి దృష్టీ పడింది. దానికి తగ్గట్టుగానే బాగానే ఖర్చు పెట్టారు. పబ్లిసిటీ కూడా బాగా చేశారు. కానీ తీరా చూస్తే, ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. బిలో యావరేజ్ రివ్యూలొచ్చాయి. వసూళ్లూ అంతంత మాత్రమే. నిజానికి ఈ కథ ముందు నితిన్ దగ్గరకు వెళ్లింది. శ్రీరామ్ ఆదిత్య - నితిన్ కలిసి ఓ సినిమా చేయాలనుకున్నప్పుడు ఈ కథే నితిన్ కి వినిపించాడట. ఈ కథపై కొంత వర్క్ కూడా చేశారు. కానీ... నితిన్ ఈ కథ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేయడంతో ప్రాజెక్టు ఆగిపోయింది. ఆ తరవాత.. గల్లా జయదేవ్ నుంచి పిలుపురావడం, తమ కుమారుడ్ని హీరోగా పెట్టి ఓ సినిమా తీయాలని, ఆ బాధ్యత శ్రీరామ్‌కి అప్పగించడంతో.. హీరో కథ.. ఇటువైపు షిఫ్ట్ అయ్యింది. లేదంటే ఈ సినిమాకి అసలు హీరో.. నితిన్ అయ్యేవాడు.