గత ఏడాదిగా విసుగు, విరామం లేకుండా పని చేస్తోంది నిత్యమీనన్. తను నటించిన ఐదు ప్రాజెక్టులు ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందుకే ఇప్పుడు బ్రేక్ తీసుకోవాలనుకుంటోంది. కనీసం మూడు నాలుగు నెలలు సినిమాలకు దూరంగా, విహార యాత్రల్లో గడపాలని ప్లాన్ చేసుకొంది నిత్య. ఈ విషయం ఇన్ స్టాలో ఓ వీడియో ద్వారా తన అభిమానులకు చేరవేసింది.
''యేడాదిగా ప్రతీ రోజూ... ఏదో ఓ షూటింగుతో బిజీగా ఉన్నా. నేనేం రోబోని కాదు కదా. నాకు విశ్రాంతి కావాలి. నా బ్యాటరీలను రీఛార్జ్ చేసుకోవాలి. అందుకే కొన్ని రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నా. విరామం తరవాత మరింత ఉత్సాహంగా పనిచేస్తా`` అని చెప్పుకొచ్చింది నిత్య. తన పెళ్లిపై ఇటీవల కొన్ని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. వాటిని మరోసారి ఖండించింది.
''ఎవరో ఓ తప్పుడు వార్త రాశారు. దాన్ని మిగిలిన వాళ్లూ క్యారీ చేసేశారు. నిజా నిజాల్ని తెలుసుకోకుండా పెళ్లి వార్తకు ప్రాచూర్యం కల్పించారు. ఈ వార్త తెలియగానే చాలా మంది ఫోన్లు చేశారు. అందులో వెడ్డింగ్ ప్లానర్లూ ఉన్నారు. 'మీపెళ్లి మేం చేస్తాం..' అని అడుగుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే నవ్వొస్తోంది'' అని లైట్ తీసుకొంది నిత్య. తన మోకాలికి ఆమధ్య చిన్నగాయం అయ్యింది. కాలు తీసి కాలు పెట్టలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ గాయం నుంచి నిత్య కోలుకొంది. ``షూటింగులన్నీ అయిపోయాక.. మోకాలి గాయం పెద్దదైంది. దాంతో ఇంట్లోనే కూర్చున్నా. ఏ పనీ చేయలేదు. కనీసం మంచం కూడా దిగేదాన్ని కాదు. ఆ క్షణాల్ని సైతం నేను ఆస్వాదించా`` అని చెప్పుకొచ్చింది నిత్య.