మలయాళ బ్యూటీ నిత్యా మీనన్, కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమాలు చాలానే చేసింది. కేవలం నటనతో అత్యద్భుతమైన సినిమాలు చేసేసింది నిత్యా మీనన్. మలయాళం, తమిళం, తెలుగు.. ఇలా పలు భాషల్లో సినిమాలు చేసిన ఈ బ్యూటీ, త్వరలోనే మెగా ఫోన్ పట్టబోతోందట. దర్శకత్వంపై మొదటి నుంచీ ఆమెకు ప్రత్యేకమైన ఆసక్తి వుంది. ఈ నేపథ్యంలోనే దర్శకత్వానికి సంబంధించి మెళకువల్ని కూడా తెలుసుకుందట. అన్నీ కుదిరితో త్వరలోనే దర్శకురాలిగా అవతారమెత్తబోతోందట నిత్యామీనన్.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఇప్పటికే అన్నీ సిద్ధం చేసుకున్న నిత్యామీనన్, 2021 జనవరిలో దర్శకురాలిగా తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ముందుగా ఓ వెబ్ సిరీస్ చేయాలన్నది నిత్యా మీనన్ ఆలోచన అట. ఫిమేల్ ఓరియెంటెడ్ కథాంశంతో ఓ స్టన్నింగ్ రొమాంటిక్ థ్రిల్లర్‌కి సంబంధించి ఆమె ఇప్పటికే ఓ కథ రెడీ చేసుకుందంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఓ ప్రముఖ ఓటీటీ సంస్థతో నిత్యామీనన్ ఈ ప్రాజెక్టుకి సంబంధించి సంప్రదింపులు కూడా జరిపిందట. అయితే, ఇప్పటిదాకా ఈ విషయమై నిత్యామీనన్ అధికారికంగా ఎక్కడా స్పందించలేదు. మరోపక్క, నిత్యామీనన్ పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా వుంది. ఛాలెంజింగ్ రోల్స్‌ని ఇష్టపడే నిత్యా మీనన్ నటిగా తెలుగు, తమిళ, మలయాళ సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపుని సొంతం చేసుకుంది.