ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో `వాల్తేరు వీరయ్య` అతి పెద్ద హిట్. ఈ యేడాది ఇప్పటి వరకూ తెలుగులో వసూళ్ల పరంగా దీన్ని మించిన సినిమా రాలేదు. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే.. ఓటీటీ విడుదల సందర్భంగా చిత్రబృందం ఎలాంటి హడావుడీ చేయలేదు. సెపరేట్ గా ట్రైలర్ కూడా కట్ చేయలేదు. ఈమధ్య ఓటీటీ విడుదలకీ భారీగా ప్రమోషన్లు ఇస్తున్నారు. పబ్లిసిటీ చేస్తున్నారు. స్పెషల్ గా ట్రైలర్ కట్ చేస్తున్నారు. వీర సింహారెడ్డి విషయంలో ఇదే జరిగింది. కానీ వాల్తేరు వీరయ్య మాత్రం నెట్ ఫ్లిక్స్‌లో ఓ చాలా సైలెంట్ గా వదిలేశారు. సినిమా ఎలాగూ హిట్టయ్యింది కాబట్టి.. జనాలు చూసేస్తారని టీమ్ భావించిందేమో..?
అయితే... మరో రెండు రోజుల్లో ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకొంటోంది. ఈరోజుల్లో 50 రోజుల సినిమాలంటే అరుదైన విషయమే. ఇప్పటికే 50 రోజుల పోస్టర్లు గోడలపై మెరిసిపోతున్నాయి. ఓటీటీ విడుదల సందర్భంగా ఎలాంటి ప్రమోషన్లు చేయని వీరయ్య టీమ్.. కనీసం 50 రోజుల పండగ అయినా చేస్తుందా? లేదా? అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆచార్య తరవాత.. చిరంజీవికి ఇది ఘనమైన కమ్ బ్యాక్. వసూళ్లు కూడా భారీగా వచ్చాయి. చిరు కెరీర్‌లో ఈ సినిమానే కలక్షన్ల పరంగా తొలి స్థానంలో ఉంది. అలాంప్పుడు 50 రోజుల పండగ చేసుకోవడం సముచితం. కానీ.. మైత్రీ మూవీస్ ఏం చేస్తుందో చూడాలి.