వరుణ్ తేజ్ లుక్, రివీల్ అయిన కథ నేపథ్యంలో 'వాల్మీకి' సినిమా ఖచ్చితంగా యాక్షన్ మూవీ అనుకునేరు. కానే కాదట. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్‌కి అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదట. కథానుగుణంగా వచ్చే యాక్షన్ సీన్స్ తప్ప, పర్టిక్యులర్ భారీ యాక్షన్ సీన్స్ ఉండవని డైరెక్టర్ హరీష్ శంకర్ చెబుతున్నారు. ఓ మనిషి అత్యున్నతమైన మార్పుకి గొప్ప నిదర్శనం 'వాల్మీకి మహర్షి'. ఆయన జీవితం అందరికీ స్పూర్తి. అందుకే మా సినిమాకి ఆ టైటిల్ పెట్టాం.
టైటిల్ విషయంలో చాలా చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం. సో టైటిల్ మార్చేది లేదని చిత్ర యూనిట్ గట్టిగా చెబుతోంది. టైటిల్ విషయంలో జరుగుతున్న రచ్చ తెలిసిన సంగతే. అయితే, టైటిల్ విషయమై ఆందోళన కారులు లేవనెత్తిన అంశంలో అంతగా పస కనిపించడం లేదు. ఏదో గొడవ పెట్టాలి.. వివాదం లేపాలి..అని తప్ప ఓ బలమైన కారణం వారిలో కనిపించడం లేదు. అయినా, కథానుగుణంగా టైటిల్‌ని ఎంచుకున్నారు. వాల్మీకిని చాలా గొప్పగా అభివర్ణిస్తున్నారు. ఆయన వ్యక్తిత్వం గురించి ఉన్నతంగా చెబుతున్నారు. ఋషిగా మారక ముందు వాల్మీకి జీవితం ఎలా ఉండేదో చాలా మందికి తెలియదు. కానీ, 'వాల్మీకి' సినిమా చూస్తే, ఆ కారణం తెలుస్తుందట.
దాంతో ఆయనపై ఉన్న గౌరవం మరింత పెరుగుతుందట. ఈ సినిమాలో గ్యాంగ్‌స్టర్ అయిన హీరోలో ఒకానొక టైంలో అత్యున్నతమైన మార్పు కనిపిస్తుందట. అది అచ్చం 'వాల్మీకి' మహర్షి వ్యక్తిత్వాన్ని తలపిస్తుందట. అందుకే ఈ సినిమాకి 'వాల్మీకి' కన్నా గొప్ప టైటిల్ లేదనిపించింది. ఈ సినిమా ఆయన పేరు, కీర్తి, ఘనత మరింత పెంచేలా ఉంటుంది తప్ప, ఆ పేరును ఎంతమాత్రమూ చెడగొట్టేలా ఉండదు. అనవసరంగా ఆందోళన చేస్తున్న బోయ కులస్థులు ఆ విషయాన్ని గ్రహించాలి అంటున్నారు. ఈ నెల 20న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది 'వాల్మీకి'.