సాహో... ఏకంగా 350 కోట్లతో తీసిన సినిమా. తొలి రోజే డివైడ్ టాక్. రివ్యూలన్నీ ఫ్లాప్ అంటూ తేల్చేశాయి. వీర అభిమానులు సైతం తమ అంచనాల్ని సాహో అందుకోలేదని నిరాశ పడ్డారు. సోషల్ మీడియాలోని ఓ వర్గం - పనిగట్టుకుని `సాహో`పై నెగిటీవ్ ప్రచారాన్ని హోరెత్తించింది. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో... సాహోకి భారీ నష్టాలు తప్పవని అనుకున్నారంతా. ట్రేడ్ పండితులు సైతం సాహో వల్ల యూవీ క్రియేషన్స్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారబోతోందని జోస్యం చెప్పారు. కానీ అంచనాలన్నీ తల్లకిందులయ్యాయి. ఇంత డివైడ్ టాక్ మధ్య కూడా సాహో స్వల్ప నష్టాలతో బయటపడగలుగుతోంది.
అదంతా ప్రభాస్ క్రేజ్ వల్లే. సాహోని భారీ నష్టాల నుంచి కాపాడింది.. కేవలం ప్రభాస్ క్రేజ్ అన్నది నిర్వివాద అంశం. బాహుబలి తరవాత ప్రభాస్ సూపర్‌స్టార్ అయిపోయాడు. బాలీవుడ్ సైతం ప్రభాస్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూసేంత స్థాయి వచ్చింది. అందుకు తగ్గట్టే సాహోని కూడా బాలీవుడ్‌లో భారీ స్థాయిలో విడుదల చేశారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా - ప్రారంభ వసూళ్లు మాత్రం ఓ రేంజ్‌లో ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు భావించారు. దానికి తగ్గట్టే బాలీవుడ్‌లో ఈసినిమా వసూళ్ల మోత మోగించింది. టాక్‌తో సంబంధం లేకుండా కోట్లు పిండుకుంది. బాలీవుడ్‌లో సాహో వంద కోట్ల మైలు రాయిని దాటేసింది.
తెలుగులోనూ.. మంచి వసూళ్లే దక్కాయి. కొన్ని చోట్ల బాహుబలి 1 రికార్డుల్ని కూడా దాటగలిగింది. ఓవర్సీస్ లో స్వల్ప నష్టాల్ని చవిచూడాల్సివచ్చింది. అయితే కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో మాత్రం సాహో మెప్పించలేకపో్యింది. అక్కడ భారీ రేట్లు పెట్టి కొన్న పంపిణీదారులు నష్టపోయారు. అయితే.. ఆ నష్టాల్ని యూవీ క్రియేషన్స్ భరించాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాలలో కొన్ని ఏరియాల్లో బయ్యర్లకు నష్టాలొచ్చినా అది పెద్ద సమస్య కాదు. డివైడ్ టాక్‌లోనూ ఈ సినిమా ఈ స్థాయిలో వసూళ్లు తెచ్చుకోవడం కేవలం ప్రభాస్ మ్యాజిక్. ఈ విషయాన్ని ఇప్పుడు ట్రేడ్ పండితులు సైతం ఒప్పుకుంటున్నారు.