టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. మహేష్ బాబు పోకిరి, పవన్ కళ్యాణ్ తమ్ముడు, తాజాగా బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి సినిమాలు థియేటర్ లో మళ్ళీ సందడి చేశాయి. ఇప్పుడు ఎన్టీఆర్ వంతు వచ్చింది. ఎన్టీఆర్ ఆది మళ్ళీ థియేటర్ లోకి వస్తోంది. ఎన్టీఆర్ హీరోగా వి.వి. వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేశ్ నిర్మాతగా రూపుదిద్దుకొన్న ఈ చిత్రం అప్పట్లో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ‘ఆది’ విడుదలై 20 సంవత్సరాలైన సందర్భంగా ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
ఇదే విషయాన్ని తాజాగా బెల్లంకొండ సురేశ్ తెలియజేశారు. ‘‘ఆది’ రీ రిలీజ్ కోసం సన్నాహాలు చేస్తున్నాం. గతేడాది కేవలం ఫ్యాన్స్ షో మాత్రమే వేశాం. కాకపోతే, ఈసారి ఎవరూ ఊహించని విధంగా భారీగా విడుదల చేయాలనుకుంటున్నాం'' అని సురేశ్ వివరించారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో చిత్రాన్ని త్వరగా చూడాలనుకుంటున్నట్లు ట్వీట్స్ చేస్తున్నారు.