సంక్రాంతికి రాబోతున్న ఎన్టీఆర్ బయోపిక్‌పై అందరి చూపు పడింది. ఈ సినిమాతో బాలయ్య ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడా? అని నందమూరి అభిమానులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. స్టార్లకు లోటు లేకపోవడం, క్రిష్ లాంటి దర్శకుడి చేయి పడడం, ఎన్టీఆర్ అనే మహనీయుడి బయోపిక్ కావడంతో.. ఎన్టీఆర్ క్రేజ్ రోజు రోజుకీ పెరుగుతోంది.
అయితే.. బయోపిక్ అంటే అన్ని అంశాలూ ఉండాలి. ఓ వ్యక్తి జీవితంలోని అన్ని కోణాల్నీ సృశించాలి. కానీ ఈ ఎన్టీఆర్ బయోపిక్‌లో ఎన్టీఆర్‌లోని పాజిటీవ్ కోణాలే చూపించబోతున్నారు. ఎన్టీఆర్ జీవితంలోని నెగిటీవ్ జోలికి అస్సలు వెళ్లడం లేదు. కేవలం ఎన్టీఆర్ విజయాల్ని కీర్తిస్తూ సాగే కథ ఇది. అలాంటప్పుడు సినీ విమర్శకులు, రాజకీయ విశ్లేషకులు, ఎన్టీఆర్ జీవితాన్ని దగ్గర నుంచి చూసినవాళ్లు, చరిత్ర కారులు ఈ సినిమాని బయోపిక్‌గా అభివర్ణిస్తారా, లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎన్టీఆర్ జీవితం తెరచిన పుస్తకం. ఆయన చరిత్రలోని అన్ని దశలూ ఆయన అభిమానులకు ఎరుకే. అలాంటప్పుడు నెగిటీవ్ షేడ్స్‌ని, ఎన్టీఆర్ జీవితంలో ఎదురైన ఇబ్బందికరమైన పరిస్థితుల్ని తెరపై చూపించక తప్పదు. కానీ. అలాంటి సన్నివేశాలకు ఈ బయోపిక్‌లో చోటు లేదని తెలుస్తోంది. 2019లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్టీఆర్ గురించి ఏమాత్రం నెగిటీవ్ విషయాలు మళ్లీ బయకు వచ్చినా... అది ఓటర్లపై ప్రభావం చూపిస్తుందని పార్టీ శ్రేణులు భయపడుతున్నాయి.
అందుకే పార్టీలో ప్రముఖ నాయకుడైన నందమూరి బాలకృష్ణ వాటి జోలికి వెళ్లనే వెళ్లడు. కేవలం పాజిటీవ్ కోణాలే చూపిస్తే అది బయోపిక్ ఎలా అవుతుంది? కమర్షియల్ సినిమాగా ముద్ర పడిపోతుంది. ఈమధ్య కాలంలో తెలుగులో వచ్చిన బయోపిక్... మహానటి. ఈ సినిమాపైనా కొన్ని విమర్శలు వచ్చినా, అది క్లాసిక్ చిత్రాల జాబితాలో నిలిచిపోయింది.
మరి.. ఎన్టీఆర్ కూడా అలా ఉండిపోతుందా? లేదంటే కేవలం కమర్షియల్ సినిమాగా నిలిచిపోతుందా? అనేది ఈ చిత్ర ఫలితాలే నిర్ణయించాలి.