ఓ కాంబో సెట్టవ్వడం, అంతలోనే - ఆ ప్రాజెక్టు ఆగిపోవడం, టాలీవుడ్ కి ఏం కొత్త కాదు. కొన్నయితే.. షూటింగ్ మొదలై కూడా - షెడ్డుకి వెళ్లిపోతుంటాయి. ఇప్పుడు మరో కాంబినేషన్ విషయంలోనూ ఇదే జరుగుతోందన్నది టాలీవుడ్ టాక్. ఉప్పెనతో పెద్ద హీరోల దృష్టిలో పడిన సుకుమార్ శిష్యుడు, బుచ్చిబాబుకి సెకండ్ సినిమాకే ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ కూడా బుచ్చితో సినిమా చేయడానికి ఉత్సాహం చూపించాడు. ఎన్టీఆర్ కోసం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఓ కథని అల్లాడని, ఈ కథ ఎన్టీఆర్ కి కూడా నచ్చిందని ప్రచారం జరిగింది. బుచ్చి రెండో సినిమా ఎన్టీఆర్ తోనే అనేది ఫిక్సయిపోయారంతా.
అయితే ఇప్పుడు అనూహ్యంగా ఎన్టీఆర్ వెనకడుగు వేసినట్టు సమాచారం. దానికి కారణం... కథ నచ్చక కాదు. తన కమిట్ మెంట్స్ వల్ల. ఎన్టీఆర్ ప్రస్తుతం `ఆర్.ఆర్.ఆర్`తో బిజీ. ఆ తరవాత కొరటాల శివతో ఓ సినిమా చేయాలి. ఆ వెంటనే.. ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు ఉంటుంది. ఎన్టీఆర్ ఖాళీ అవ్వాలంటే కనీసం రెండేళ్లయినా పడుతుంది. అప్పటి వరకూ బుచ్చి సినిమా చేయకుండా ఉండలేడు కదా. అందుకే ఎన్టీఆర్ బుచ్చిని పిలిపించి మేటర్ క్లియర్ చేసినట్టు టాక్. `నీతో సినిమా చేస్తా. కానీ ఇప్పుడు కాదు. ఈలోగా మరో సినిమా చేసుకురా..` అని సున్నితంగానే చెప్పాడట. దాంతో బుచ్చి కూడా మరో హీరో అన్వేషణలో పడ్డాడని తెలుస్తోంది. ఈసారి కూడా బుచ్చి మెగా కాంపౌండ్ లో అడుగుపెట్టబోతున్నాడని, అల్లు అర్జున్ కి టచ్ లో వెళ్లాడని పరిశ్రమలో గాసిప్పులు కూడా మొదలైపోయాయి.