యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెండితెరపై రికార్డులు సృష్టించడమే కాదు.. బుల్లితెరపైనా సత్తా చాటేశాడు. బిగ్‌బాస్ రియాల్టీ షో తెలుగు సీజన్ వన్‌కి హోస్ట్‌గా వ్యవహరించిన యంగ్ టైగర్, టీఆర్పీ రేటింగుల దుమ్ము దులిపేశాడు. ఆ తర్వాత మరో రెండు సీజన్లు వచ్చినా, యంగ్ టైగర్ హోస్టింగ్‌ని ఇప్పటికీ బుల్లితెర వీక్షకులు మర్చిపోలేదు. ఆనాటి ఆ రియాల్టీ షోని ఇప్పుడు మళ్ళీ ప్రసారం చేయబోతున్నారనగానే, యంగ్ టైగర్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం తన్నుకొచ్చింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా విడుదలవుతోందా? అనే స్థాయిలో సోషల్ మీడియాలో హంగామా జరుగుతోందిప్పుడు.
ఓ ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛాన్‌లో బిగ్‌బాస్ సీజన్ వన్ పునఃప్రసారం కాబోతోంది.. అన్నట్టు హైలైట్స్ మాత్రమేనండోయ్. అయినాగానీ, ఈ రియాల్టీ షో కోసం అభిమానులు ఓ రేంజ్‌లో ఎదురుచూసేస్తున్నారు. అదీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సత్తా అంటే. కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్త లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో, షూటింగులు నిలిచిపోయాయి. దాంతో, టీవీ సీరియళ్ళ కొరత ఏర్పడింది. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో స్లాట్స్ ఖాళీగా కన్పిస్తున్నాయి. ప్రకటనలు కూడా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో బుల్లితెర వీక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ లోటు లేకుండా ఆయా ఛానల్స్ ‘రిపీట్ ప్రోగ్రామ్స్’ మీద ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ రియాల్టీ షో పునఃప్రసారానికి ప్లాన్ చేశారన్నమాట. కారణం ఏదైతేనేం.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై ఇచ్చే ఆ కిక్కే వేరప్పా.