ఎవరి నోట విన్నా... నాటు నాటు పాట గురించే. ఆస్కార్ నామినేషన్ పొందిన తరవాత... దీని ప్రాచుర్యం మరింత పెరిగిపోయింది. అయితే ఇదంతా అంత ఈజీగా వచ్చిందేం కాదు. ఈ పాట వెనుక చాలా కష్టం దాగుంది. గీత రచయిత చంద్రబోస్ 19 నెలలు కష్టపడి రాసిన పాట ఇది. నృత్య దర్శకుడు ప్రేమ్ రక్షిత్ ఈ పాట కోసం ఏకంగా 95 సిగ్నేచర్ స్టెప్పులు డిజైన్ చేశారు. నాటు నాటులోని మనం చూస్తున్న సిగ్నేచర్ స్టెప్ ఓకే అవ్వడానికి 18 టేకులు తీసుకొన్నారు. ఈ పాట ఉక్రేయిన్‌లో తెరకెక్కించారు. ఈ పాట ట్యూన్ కోసం కీరవాణి నెలల తరబడి శ్రమించారు. ఇదంతా ఒక ఎత్తు. తెర వెనుక ఎన్టీఆర్, రామ్ చరణ్ పడిన కష్టం మరో ఎత్తు. ఎలాంటి క్లిష్టతరమైన స్టెప్ అయినా చిటికెలో నేర్చేసుకోవడం ఎన్టీఆర్, చరణ్‌లకు అలవాటు. అయితే... ఈ పాట కోసం రోజుకి 3 గంటల పాట ప్రాక్టీస్ చేసేవాళ్లు.
''డాన్స్ చేయడం మామూలే. కానీ...నేనూ చరణ్ ఒకే సింక్‌లో స్టెప్పులు వేయాలి. అది మాత్రం చాలా కష్టం అనిపించేది. అంతా బాగానే ఉంది అనుకొన్నప్పుడు కూడా.. రాజమౌళి వన్ మోర్ చెప్పేవారు. అదెందుకో మాకు అర్థమయ్యేది కాదు. ఇంత చిన్న విషయాల్ని ప్రేక్షకులు ఎలా పట్టించుకొంటారు? అని రాజమౌళితో గొడవ పెట్టుకొనేవాడ్ని. కానీ ఆయన మాత్రం వినేవారు కాదు. ఇప్పుడు పాటలోని మా స్టెప్పులు అంతలా సింక్ అవ్వడం వల్లే ఇప్పుడు ఇంత పేరొచ్చింది. ఈ క్రెడిట్ అంతా రాజమౌళిదే'' అని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్.