ఈరోజుల్లో కథానాయకుల పారితోషికాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హిట్లు, ఫ్లాపులతో పనిలేదు. సినిమా సినిమాకీ పారితోషికం పెంచుకుంటూ పోవడమే. హీరోలు ఎంత అడిగినా ఇవ్వడానికి నిర్మాతలు కూడా రెడీగానే ఉన్నారు. దాంతో.. వారి పారితోషికాలకు ఆకాశమే హద్దుగా తయారైంది. ఇది వరకు ఓ హీరో రూ.10 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడంటే.. అమ్మో అనేవారు. ఇప్పుడు ఒకట్రెండు హిట్లు ఉన్న కుర్ర హీరో కూడా పది కోట్లు అందుకుంటున్నాడు. నాని లాంటి సెకండ్ టైర్ హీరోలు రూ.15 కోట్లు తీసుకుంటున్నారు. అగ్ర హీరోలైతే రూ.50 కోట్ల పైమాటే. ప్రభాస్ పారితోషికం వంద కోట్లు దాటేసింది. మిగిలిన వాళ్లూ... వంద కోట్ల వైపు అడుగులు వేస్తున్నారు.
ఆర్.ఆర్.ఆర్ కోసం రూ.45 కోట్లు అందుకున్నాడు ఎన్టీఆర్. తాజాగా కొరటాల శివతో ఓ సినిమా చేయడానికి ఒప్పుకొన్నాడు. ఈ సినిమాకిగానూ రూ.60 కోట్ల పారితోషికం అందుకోబోతున్నాడట. త్వరలోనే మైత్రీ మూవీస్ తో ఓ సినిమా చేయబ్తున్నాడు ఎన్టీఆర్. దానికి రూ70 కోట్ల వరకూ పారితోషికం తీసుకుంటాడని తెలుస్తోంది. మహేష్ బాబు పారితోషికం రూ.55 కోట్ల వరకూ ఉంది. సర్కారు వారి పాటకు రూ.55 కోట్లు తీసుకొన్నాడు మహేష్. ఆ లెక్కన ఎన్టీఆర్ మహేష్‌ని దాటేసినట్టే. అయితే... రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ సినిమాకి దాదాపుగా రూ.100 కోట్లు వసూలు చేయబోతున్నట్టు టాక్. ఆ లెక్కన.. ఎన్టీఆర్ పై మళ్లీ మహేష్ పై చేయి సాధించినట్టే.