కరోనాతో పరిస్థితులు తల్లకిందులయ్యాయి. ప్రపంచం కరోనాకి ముందు - ఆ తరవాతగా మారిపోయింది. చిత్రసీమలోనూ ఈ మార్పులు కనిపిస్తున్నాయి. ఇది వరకు షూటింగ్ అంటే కార్ వాన్లూ, లైట్లూ, కెమెరాలూ.. అంటూ హడావుడి కనిపించేది. ఇప్పుడు మాస్క్‌లు, శానిటైజేషన్‌లూ, ధర్మల్ స్క్రీనింగులు కనిపిస్తున్నాయి. బిగ్ బాస్ రియాలిటీ షో కోసం.. సెలబ్రెటీలను క్వారెంటైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సినిమా నటీనటులకూ అలాంటి పరిస్థితే ఎదురు కానుంది. షూటింగ్‌కి రాబోయే నటీనటులు, సాంకేతిక నిపుణుల్నీ క్వారెంటైన్‌లో ఉంచబోతున్నార్ట. ఈ కొత్త పద్ధతి `ఆర్.ఆర్.ఆర్` నుంచే మొదలు కాబోతోందని తెలుస్తోంది.
రామ్‌చరణ్, ఎన్టీఆర్ కలసి నటిస్తున్న చిత్రం `ఆర్.ఆర్.ఆర్`. ఈ సోమవారం నుంచి ట్రైల్ షూట్ మొదలు కానుంది. ఆ తరవాత రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. అయితే.. షూటింగ్ కి ముందు ఎన్టీఆర్, చరణ్‌లతో పాటు కీలకమైన సభ్యుల్ని క్వారెంటైన్‌లో ఉంచబోతున్నార్ట. ఈ సమయంలో.. వీళ్లంతా కేవలం హోటెల్ రూమ్‌లకే పరిమితం కానున్నారని తెలుస్తోంది. వీళ్లందరికీ కోవిడ్ టెస్ట్‌లు చేయించాకే.. సెట్లో అడుగు పెట్టనిస్తార్ట. అయితే ఇవన్నీ ఆచరణలో సాధ్యమేనా అన్నది మాత్రం అనుమానమే. ఎందుకంటే... షూటింగ్ అంటే వందలమందితో సాగే ప్రయాణం. రోజూ.. ఎవరెవరో సెట్లోకి వస్తుంటారు. అందరికీ కోవిడ్ పరీక్షలు చేయించాలంటే కష్టమే. మరి.. రాజమౌళి ఎలాంటి ప్లానింగ్ వేస్తున్నారో, ఏ నమ్మకంతో ఈ పద్ధతి ప్రవేశ పెట్టారో చూడాలి.