దేశంలోనే నెంబర్ వన్ దర్శకుడు ఎవరంటే రాజమౌళి పేరే చెబుతారంతా. ఆయన సృష్టించిన అద్భుతాలు అలాంటివి. బాలీవుడ్ దిగ్గజాలు కూడా రాజమౌళితో సినిమా చేయాలని ఉత్సాహం చూపిస్తుంటారు. కానీ.. రాజమౌళితో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆయన సినిమా ఒప్పుకుంటే... హీరోలు లాక్ అయిపోయినట్టే. ఏళ్లకు ఏళ్లు ఆ సినిమాతోనే ప్రయాణం చేయాలి. మరో సినిమా ఒప్పుకోవడానికి వీల్లేదు. దాంతో చేతికి అందిన సినిమాలూ చేజారిపోతుంటాయి. ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్‌ల పరిస్థితి ఇదే.
`ఆర్.ఆర్.ఆర్`లో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాకి కమిట్ అయ్యాడు. రామ్ చరణ్ `ఆచార్య`లో నటించాలి. అయితే `ఆర్.ఆర్.ఆర్` పూర్తయ్యే వరకూ మరో సినిమా చేయకూడదని, కనీసం గెటప్పులు కూడా మార్చకూడదని రాజమౌళి వార్నింగ్ ఇచ్చాడట. అంతే కాదు.. షూటింగ్ పూర్తయినా, రిలీజ్‌కి ముందు వరకూ ఎవరి గెటప్పులలో వాళ్లు ఉండాల్సిందేనని చెప్పేశాడట. ఎందుకంటే... మధ్యలో చిన్న చిన్న మార్పులు చేయాల్సివచ్చి, రీషూట్లు పెట్టాల్సివస్తే హీరోలు ఆయా గెటప్పులతో అందుబాటులో ఉండాలి. అందుకే ఈ జాగ్రత్త. కాకపోతే.. `ఆచార్య`లో రామ్ చరణ్ నటించాల్సివుంది. అందుకోసం తప్పకుండా గెటప్ మార్చాల్సిందే.
రాజమౌళి పద్ధతి చూస్తుంటే.. గెటప్ మార్చాడానికి ఏమాత్రం వీలు లేకుండా వుంది. మరో వైపు ఎన్టీఆర్ పరిస్థితి కూడా అంతే. త్రివిక్రమ్ తో ఓ సినిమా ఓకే చేసుకున్నాడు ఎన్టీఆర్. ఇప్పుడు `ఆర్.ఆర్.ఆర్` విడుదలైతేగానీ, ఆయనతో సినిమా చేయలేడు. అలా.. ఇద్దరు టాప్ స్టార్లు అడ్డంగా బుక్కయిపోయారు.