చిన్ని తెర... మరీ అంత చిన్ని తెర కాదు. దాని స్వరూపాన్ని మార్చేయడానికి స్టారెప్పుడూ రెడీనే. చిరంజీవి, నాగార్జున, నాని, రానా, సమంత... ఇలా స్టార్సంతా బుల్లి తెరపై సందడి చేసిన వాళ్లే. వాళ్లెప్పుడు చిన్ని తెరపై కనిపించినా అది పెద్ద సంచలనమే అయ్యింది. ఎన్టీఆర్‌కి బుల్లి తెర కొత్తేం కాదు. `బిగ్ బాస్`ని తనదైన స్టైల్ లో రక్తి కట్టించాడు. ఇప్పుడు మరోసారి.. ఎన్టీఆర్ చిన్ని తెరపై పెద్ద సందడినే తీసుకురాబోతున్నాడు.
ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా జెమినీ టీవీలో ఓ రియాలిటీ షో ప్రదర్శితం కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ రియాలిటీ ని తెరకెక్కించబోతోంది. ఇది టాక్ షోనా.. మరేదైనా వెరైటీ షోనా అనేది మాత్రం తెలియాల్సివుంది. ఈ షోని నడిపించడానికి ఎన్టీఆర్ ఒప్పుకున్నాడట. అందుకోసం ఎన్టీఆర్ భారీ పారితోషికాన్ని అందుకోబోతున్నాడని సమాచారం. బిగ్ బాస్ సీజన్‌ని సమర్థవంతంగా నడిపించిన తరవాత.. ఎన్టీఆర్ కి అలాంటి ఆఫర్లు చాలా వచ్చాయి. కానీ ఎన్టీఆర్ మాత్రం ఇటు వైపు రావడానికి మొగ్గు చూపించలేదు. ఈసారి మాత్రం.. ఎస్ అనేశాడు. షో.. అంత వెరైటీగా ఉండబోతోందట. పైగా... కళ్లు చెదిరే పారితోషికం ఆఫర్ చేశారట. పైగా అన్నపూర్ణ స్టూడియోస్ హ్యాండ్ ఉందాయె.అందుకే ఎన్టీఆర్ ఎందుకు కాదంటాడు..?? మరి ఈ షో పూర్వాపరాలేంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.