ఇప్పుడు హీరోలందది చూపూ `పాన్ ఇండియా` వైపు పడింది. కథ ఏదైనా. దర్శకుడు ఎవరైనా. జోనర్ ఎలాంటిదైనా... భారతదేశ వ్యాప్తంగా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఎన్టీఆర్ కూడా ఇప్పుడు పాన్ ఇండియా మంత్రం జపిస్తున్నాడు. రాజమౌళి మల్టీస్టారర్ `ఆర్.ఆర్.ఆర్` పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరవాత.. ఎన్టీఆర్‌కీ పాన్ ఇండియా ఇమేజ్ ఏర్పడుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాడు తారక్.
అందుకే తన తదుపరి సినిమాని పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదల చేయాలని భావిస్తున్నాడు. ఆల్రెడీ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కి ఫిక్సయిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబో సెట్స్‌పైకి వెళ్లనుంది. త్రివిక్రమ్ సినిమా అంటే డైలాగులకు పెట్టింది పేరు. ఆయన డైలాగులతో సినిమాల్ని హిట్ చేసిన సందర్భాలున్నాయి. తెలుగు ప్రేక్షకుల వరకూ త్రివిక్రమ్ డైలాగులకు తిరుగుండదు. కానీ పాన్ ఇండియా కొలతలు వేరు. మిగిలిన భాషల్లో సినిమా క్లిక్ అవ్వాలంటే యాక్షన్ కి పెద్ద పీట వేయాలి. అందుకే... మాటల కంటే, ఫైట్ల వైపు దృష్టి పెట్టాలని త్రివిక్రమ్ కి ఎన్టీఆర్ సూచనలు జారీ చేశాడని తెలుస్తోంది. దానికి తగ్గట్టే.. త్రివిక్రమ్ ఈ స్క్రిప్టులో మార్పులు చేర్పులకు దిగినట్టు సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ ఎప్పుడో కథ సిద్ధం చేసేశాడు. డైలాగ్ వెర్షన్ కూడా రెడీ. కానీ.. ఎన్టీఆర్ సూచనల మేరకు... కథలో మార్పులూ చేర్పులకూ దిగినట్టు సమాచారం. నటీనటుల ఎంపికలోనూ.. పాన్ ఇండియా ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకోవాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. సో.. ఈ స్క్రిప్టులో భారీ మార్పులు తప్పవన్నమాట.