‘‘రిస్క్ తీసుకోకపోతే జీవితంలో ఏమీ సాధించలేం. సాధించాలనుకుంటే రిస్క్ చేయాలి. ఇది నా తత్వం'' ఓ సందర్భంలో సూపర్ సూపర్ స్టార్ కృష్ణ చెప్పిన మాటలివి. ఈ మాటలని అడుగడుగునా పాటించి చూపారు కృష్ణ. ఈ రిస్క్ నుండే అల్లూరి సీతారామరాజు లాంటి క్లాసిక్ వచ్చింది.
అల్లూరి వెనుక చాలా ఆసక్తికరమైన సంఘటనలు వున్నాయి. 'పద్మాలయా కొత్త చిత్రం అల్లూరి సీతారామరాజు' అనే ప్రకటన చూసి ఇండస్ట్రీ నుండి ఫుల్ నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కృష్ణ రెగ్యులర్ పంపిణీదారులు నవయుగ ఫిలిమ్స్ పూర్తిగా రివర్స్ అయ్యింది. ''కథలో కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు. యుగళగీతాలు వుండవు, వినోదం వుండదు, గ్లామర్ వుండదు. గడ్డం పెంచుకుని అడవిలో తిరిగే పాత్రని ఓ కమర్షియల్ హీరో చేయడం వర్క్ అవుట్ అవ్వద్దు. మేము సినిమాని పంపిణీ చేయం' అని తేల్చేసింది.
ఆఖరికి ఎన్టీఆర్ కూడా ''వద్దు బ్రదర్ .. ఇలాంటి డ్రై సబ్జెక్ట్ లు పే చేయవు'' అని సలహా ఇచ్చారు. అయితే కృష్ణ అప్పటికే బలంగా నిర్ణయించుకున్నారు. ''అన్నగారు ఈ పాత్ర మీరు చేయాలని అనుకున్నారు. మీరు చేస్తానంటే చెప్పండి. ఇప్పుడే డ్రాప్ అయిపోతాను. లేదు అంటే ఖచ్చితంగా చేస్తాను'' అని తేల్చి చెప్పారు. ఎన్టీఆర్ స్పందన కోసం కొన్ని రోజులు చూశారు. ఆయన నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో అల్లూరిని సెట్స్ పైకి తీసుకెళ్ళారు. సినిమా విడుదలైయింది. తర్వాత చరిత్ర అందరికీ తెలిసిందే.