ఓం భీమ్ బుష్ మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

చిత్రం: ఓం భీమ్ బుష్
దర్శకత్వం: శ్రీ హర్ష కొనుగంటి

నటీనటులు: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ 

నిర్మాతలు: సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్స్

సంగీతం:   స‌న్నీ ఎంఆర్
ఛాయాగ్రహణం: రాజ్ తోట
కూర్పు: విష్ణు వర్షన్ కావూరి

బ్యానర్స్: వి సెల్యులాయిడ్స్
విడుదల తేదీ: 22 మార్చి 2024


ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 3/5


ప్రేక్షకులని కేవలం నవ్వించడమే పరమావధిగా కొన్ని సినిమాలు వస్తుంటాయి. శ్రీవిష్ణు 'ఓం భీమ్ బుష్' ట్రైలర్ చూసినప్పుడు ఇదే అనిపించింది.  శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ త్రయం కామెడీ టైమింగే ప్రధాన బలంగా కనిపించింది. కామెడీ, హారర్, ట్రెజర్ హంట్, మిస్టరీ, అఘోరాలు.. ఇలా చాలా జోనర్లు కనిపించడం ఇంకాస్త ఆసక్తిని రేపింది. మరి ఆ నవ్వించే ప్రయత్నం మెప్పించిందా? ఇందులో ప్రేక్షకులకు వినోదాన్ని పంచే అంశాలేమిటి? అందులో లాజిక్ ఎంత ? మ్యాజిక్ ఎంత ? 


కథ: క్రిష్ (శ్రీవిష్ణు), విన‌య్ గుమ్మడి (ప్రియ‌ద‌ర్శి), మాధవ్ రేలంగి (రాహుల్ రామ‌కృష్ణ).. ఈ ముగ్గురు పీహెచ్‌డీ కోసం ప్రొఫెసర్ (శ్రీకాంత్ అయ్యంగర్) రికమండేషన్ తో యూనివ‌ర్సిటీలో చేరుతారు. వీళ్ళ అసలు ఉద్దేశం మాత్రం పీహెచ్డీ కాదు. ఆ వంకతో అప్పనంగా యూనివ‌ర్సిటీలో కాలం గడిపేయాలని. వీళ్లు చేసే ప‌నులు భ‌రించ‌లేక త‌క్కువ స‌మ‌యంలోనే  ముగ్గురికీ డాక్టరేట్లు ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు ప్రొఫెస‌ర్‌. తర్వాత ఈ ముగ్గురు భైర‌వ‌పురం చేరుకుంటారు. ఆ ఊర్లో కొందరు అఘోరాలు ఏవో సమస్యలకి పరిష్కారం చూపిస్తుంటారు. అదేదో మంచి బిజినెస్ లా వుందని, ఆ ఊళ్లో కూడా  కింగ్స్ లా బ‌తకాల‌ని నిర్ణయించుకుని సైంటిస్టుల అవ‌తారమెత్తి ‘బాంగ్ బ్రోస్’ ఎ టు జెడ్ స‌ర్వీసెస్ పేరుతో ఓ దుకాణం తెరిచి ఎలాంటి స‌మ‌స్యల‌కైనా ప‌రిష్కారం చూపిస్తామ‌ని ప్రచారం చేసుకుంటారు. కొన్ని సమస్యలని పరిష్కరిస్తారు కూడా. అదంతా మోసమని గ్రామ సర్పంచ్ కి  అర్ధమౌతుంది. దీంతో ఊరి స‌ర్పంచ్, అఘోరాలు కలసి  ఓ ప‌రీక్ష పెడతారు. ఆ గ్రామంలో వున్న సంపంగి మ‌హ‌ల్‌లో ఉన్న నిధిని క‌నిపెట్టి తీసుకొస్తే నిజ‌మైన సైంటిస్టుల‌ని న‌మ్ముతామ‌ని చెబుతాడు. ఆ మ‌హ‌ల్‌లోకి నిధి కోసం వెళ్లాక ఈ బ్యాంగ్ బ్రద‌ర్స్‌కి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి?  ఇంత‌కీ సంపంగి ఎవరు? ఆ మహల్ చరిత్ర ఏమిటి ? నిజంగా నిధిని తీసుకొచ్చారా? ఇవన్నీ తెరపై చూడాలి.   


విశ్లేషణ: కొత్త పాయింట్ వుంటే సరిపోదు ఆ పాయింట్ ని చెప్పే విధానం కూడా కొత్తగా వుండాలి. 'ఓం భీమ్ బుష్' లో కూడా ఓ కొత్త పాయింట్ వుంది.  ఆ పాయింట్ ని చెప్పడానికి దర్శకుడు ఎంచుకున్న మార్గం కొంతవరకు మెప్పిస్తుంది. ఈ పాయింట్ చెప్పడానికి జోనర్లుని మార్చుకుంటూ వెళ్ళాడు దర్శకుడు. ఈ ప్రయత్నం మంచి ఫలితాన్నే ఇచ్చింది. కాలేజ్ కథగా మొదలై విలేజ్ కామెడీ లోకి వెళ్లి తర్వాత ఫాంటసీ, హారర్ జోనర్ లోకి షిఫ్ట్ అయ్యే ఈ కథని చాలా వరకూ నవ్వించగలిగింది. ఈ ముగ్గురు పాత్రలని పరిచయం చేస్తూ యూనివర్షిటీలో జరిగే సరదా సన్నివేశాలతో కథని మొదలుపెట్టాడు దర్శకుడు. విలేజ్ కి షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ మనుషులు, వాళ్ళ సమస్యలని తీర్చే క్రమంలో వచ్చే కామెడీ సీన్లు నవ్విస్తాయి. కొన్ని సీన్స్ కు లాజిక్ వుండదు కానీ నవ్విస్తాయి. 


అసలు ఇందులో కథ ఏమిటనే పాయింట్ ఇంటర్వెల్ వరకూ కానీ మొదలవ్వదు. కానీ కథ గురించి అలోచించే అవకాశం ప్రేక్షకుడికి ఇవ్వకుండా కేవలం నవ్వులుపంచుతూనే వెళ్ళాడు దర్శకుడు. ఇందులో సక్సెస్ అయ్యాడు. ఇంటర్వెల్ తర్వాత కథ పూర్తిగా హారర్ కామెడీ మలుపు తీసుకుంటుంది. సంపంగి దెయ్యం నేపధ్యంలో వచ్చే సన్నివేశాలు భయపెడుతూనే నవ్విస్తుంది. అయితే ఎన్ని వినోదాలు వున్నా అసలు కథ రివిల్ చేసిన్నప్పుడు అందులో కంటెంట్ బలంగా వుండాల్సిందే. ఇందులో కూడా ఒక బలమైన పాయింటే వుంది. అయితే ఆ పాయింట్ ని అంత బలంగా చూపించలేకపోయారు. చివర్లోకి వచ్చేసరికి కామెడీ కూడా డౌన్ అయిపోతుంది. క్లైమాక్స్ కూడా అంత బలంగా వుండదు. దీనికి పార్ట్ 2 వుందని కూడా హింట్ ఇచ్చారు. 


నటీనటులు: శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ.. ఈ ముగ్గురే సినిమాకి బలం. కథ కంటే ఈ ముగ్గురి టైమింగ్ పైనే ఎక్కువ ఆధారపడ్డాడు దర్శకుడు. శ్రీవిష్ణు హుషారుగా కనిపించారు. తన హెయిర్ స్టయిల్, డైలాగ్ చెప్పే విధానం, రియాక్షన్స్.. అన్నీ నవ్విస్తాయి. ప్రియదర్శి, రాహుల్ పాత్రలు కూడా భలే పండాయి. ముఖ్యంగా రాహుల్ చెప్పే సింగిల్ లైనర్స్ తెగ నవ్విస్తాయి. ఈ ముగ్గురి అల్లరితో సినిమా సరదాగా సాగిపోతుంది. జలజ పాత్రలో కనిపించిన ప్రియముకుందన్, రత్తాలు గా అయేషా పరిధి మేరకే వుంటారు. ప్రియవడ్లమాని చేసిన ప్రత్యేక పాటలో తన ఇమేజ్ కి భిన్నంగా గ్లామరస్ షోని గమనించవచ్చు. రచ్చ రవి కూడా కొన్ని నవ్వులు పంచాడు. మిగతా నటులు పరిధిమేర వున్నారు 


టెక్నికల్ : సన్నీ నేపధ్య సంగీతం సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. హారర్ బీజీఎం భయపెట్టేలా ఇచ్చాడు. కొన్ని సౌండ్ ఎఫెక్ట్స్ ఉలిక్కిపడేలా చేస్తాయి. రాజ్ తోట కెమరాపనితనం బావుంది. విజువల్స్ రిచ్ గా వుంటాయి. దర్శకుడు రాసుకున్న సింగిల్ లైనర్స్ బాగా పేలాయి. కానీ కొన్ని మాటల్లో ద్వందార్ధాలు ధ్వనిస్తాయి. యువీ నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా వున్నాయి. 


ప్లస్ పాయింట్స్ 
శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ 
కామెడీ 
హారర్ ఎలిమెంట్ 


మైనస్ పాయింట్స్ 
అసలు కథ తేలిపోవడం 
బలహీనమైన క్లైమాక్స్ 


ఫైనల్ వర్దిక్ట్: నవ్వుల కటకట..


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS