ఓం నమో వేంకటేశాయ మూవీ రివ్యూ

మరిన్ని వార్తలు

తారాగణం: నాగార్జున, సౌరభ్‌జైన్‌, అనుష్క, ప్రగ్యా జైశ్వాల్‌, జగపతిబాబు, విమలారామన్‌, అస్మిత, రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌, ప్రభాకర్‌, రఘుబాబు తదితరులు
నిర్మాణం: ఎ.ఎం.ఆర్‌.సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి.
నిర్మాత: మహేష్‌ రెడ్డి
సినిమాటోగ్రఫీ: ఎస్‌. గోపాల్‌ రెడ్డి
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
దర్శకత్వం: రాఘవేంద్రరావు

కథా కమామిషు:

'అన్నమయ్య', శ్రీరామదాసు', 'షిరిడీ సాయి' చిత్రాల తర్వాత రాఘవేంద్రరావు, నాగార్జున కలయికలో వచ్చిన భక్తి రస చిత్రమిది. దేవుణ్ణే చూస్తూ విద్యాభ్యాసం చేయాలని చిన్నతనంలోనే ఇంటి నుండి బయటకొచ్చేస్తాడు రామ (నాగార్జున). అలా తిరుమల చేరుకుంటాడు. అన్న, పానీయాలు మానేసి స్వామి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తన జీవితం స్వామి ఆరాధన కోసమే అంటూ నిరంతరం శ్రీనివాసుని సేవలో మునిగిపోతాడు. అసలు ఆయనకి స్వామి దర్శనం కలిగిందా? లేదా? అసలు రామ, హథీరామ్‌ బాబాగా ఎలా మారాడు? అది తెలియాలంటే సినిమా చూస్తేనే బాగుంటుంది.

నటీనటులెలా చేశారు:

'అన్నమయ్య', శ్రీరామదాసు' పాత్రలతో ఆల్రెడీ భక్తి రస పాత్రలకు తాను పర్‌ఫెక్ట్‌ అని నిరూపించుకున్నాడు నాగార్జున. ఇప్పుడు హథీరామ్‌ బాబా పాత్రలో అత్యద్భుతంగా నటించి, ఆకట్టుకున్నాడు. తన కోసమే ఈ పాత్ర అన్నట్లుగా పాత్రలో లీనమైపోయి నటించాడు. నాగార్జున. ఇక పతాక సన్నివేశాల్లో నాగార్జున నటనకి నూటికి నూరు మార్కులు వేయించుకుంటారనడంలో ఏమాత్రం ఢోకా లేదు. రామ పాత్రలోనైనా, హథీరామ్‌ బాబాగానైనా ఆయన చూపిన హావభావాలు అందర్నీ మంత్ర ముగ్దుల్ని చేస్తాయి. ఈ చిత్రాన్ని నాగార్జున ఎంత ఇష్టపడి చేశారో, ప్రతి సీన్‌లోనూ ఆ ఇష్టం కన్పిస్తుంది.

కృష్ణమ్మగా అనుష్క పాత్ర చాలా కీలకం ఈ సినిమాలో. ఆ పాత్రకి దర్శకేంద్రుడు ఎందుకు అనుష్కనే ఎంచుకున్నారో సినిమా చూస్తే అర్ధమవుతుంది. అంత చక్కగా ఆ పాత్రలో ఒదిగిపోయింది అనుష్క. వేంకటేశ్వరస్వామి భక్తురాలిగా క్లైమాక్స్‌ వరకూ అనుష్క పాత్ర కనిపిస్తూనే ఉంటుంది. కృష్ణమ్మగా ఆమె గెటప్‌ చాలా బాగుంది. భవానీ పాత్రలో ప్రగ్యా జైశ్వాల్‌కు అంతగా ప్రాధాన్యత లేకపోయినప్పటికీ, ఉన్నంతలో ఆమె తన పరిధి వరకూ బాగా నటించింది. చాలా అందంగా కనిపించింది.

వేంకటేశ్వర స్వామి పాత్రలో బాలీవుడ్‌ నటుడు సౌరభ్‌ బాగున్నాడు. స్వామి పాత్రలో ఆయన పర్సనాలిటీ ఆకట్టుకునేలా ఉంది. జగపతిబాబు పాత్ర చిన్నదే అయినప్పటికీ గుర్తుండిపోయే పాత్రలో ఆయన కనిపించారు. ఇక రావు రమేష్‌, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌ తదితర పాత్రలు వినోదం పండించడం ద్వారా బాగా ఆకట్టుకుంటాయి.

సాంకేతిక వర్గం పనితీరు:

దర్శకేంద్రుడు ఇంత చక్కగా ఈ కథని తెరకెక్కించిన విధానం అందర్నీ ఆకట్టుకుంటుంది. సాంకేతికంగా చాలా ఉన్నతంగా కనిపించింది. ఎస్‌. గోపాల్‌ రెడ్డి కెమెరా పనితనం ప్రతీ సీన్‌లోనూ అత్యద్భుతంగా కనిపించింది. ముఖ్యంగా శేషగిరులను చూపించిన విధానంలో ఆయన విజన్‌ ఎంతో అందంగా ఉంది. చూస్తున్నంత సేపూ ప్రతీ ఒక్కరినీ మంత్ర ముగ్దుల్ని చేస్తుంది. కీరవాణి సంగీతం సినిమాకి ప్రాణం అని చెప్పొచ్చు. ఆయన తన గాత్రంతో సినిమా స్థాయిని పెంచేశారు. గుండెకు హత్తుకునే నేపధ్య సంగీతంతో, ఆయన స్వరం కథలో కీలక పాత్ర పోషించింది. పాటల్లోని సాహిత్యం కథలో మిళితమైపోయి, అందరికీ సులువుగా చేరువవుతుంది. నాగార్జున - ప్రగ్యా జైశ్వాల్‌, జగపతి బాబు - అనుష్కలపై తెరకెక్కించిన సన్నివేశాలు భక్తి రసంలో దర్శకేంద్రుడికి సాటి ఎవరూ లేరనే సంగతిని మరోసారి ప్రూవ్‌ చేశాయి. పండ్లు, పూలు, దీపాలతో స్క్రీన్‌ అంతా కలర్‌ఫుల్‌గా మార్చేయడంలో దర్శకేంద్రుడు తన మార్క్‌ని చూపారు. భక్తి రసంతో పాటు కమర్షియల్‌ హంగుల్ని కూడా ఎక్కడా మర్చిపోకుండా చూపించారు దర్శకేంద్రుడు ఈ సినిమాలో.

విశ్లేషణ:

అంతటి గొప్ప భక్తులైన హథీరామ్‌ బాబా, కృష్ణమ్మల జీవితాలతో పాటు, తిరుమల ఆలయ విశిష్టత, స్థల పురాణం, వరాహ మూర్తి దర్శనం, ఏడు కొండల చరిత్ర, శ్రీవారి సేవల విశిష్టతలను కూడా ఈ సినిమాలో చూపించారు. టోటల్‌గా తిరుమల గిరి గురించి తెలియని ఎన్నో విషయాలను ఈ సినిమా ద్వారా కళ్లారా చూసి తెలుసుకునే భాగ్యం కలుగుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవాన్ని తెరపై చూస్తున్నంత సేపూ ప్రతి ఒక్కరూ ఆధ్మాత్మిక ప్రపంచంలో ఉన్నామనే భావన కల్పించడంలో దర్శకుడు సఫలమయ్యారు. కమర్షియల్‌ అంశాలనే కోణంలో ప్రేక్షకుడు ఆలోచించకుండా దర్శకేంద్రుడు భక్తిభావంలో ముంచెత్తేశాడు. నటీనటుల ప్రతిభ, దర్శకేంద్రుడి పనితనం అన్నీ కలిసి ఈ చిత్రాన్ని ఓ ఆధ్మాత్మిక అద్భుతంగా మార్చేశాయి.

ఫైనల్‌ వర్డ్‌:

'ఓం నమో వేంకటేశాయ' ప్రతీ ఒక్కరూ భక్తితో చూసి, తరించాల్సిన సినిమా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS