నాగార్జున తాజా చిత్రం 'ఓం నమో వేంకటేశాయ' సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలకు తగ్గట్లుగానే ఈ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటోంది. సినిమా చాలా బాగుంది, నాగార్జున చాలా బాగా నటించారు అంటున్నారు చిత్రం చూసినవాళ్లంతా. గతంలో ఇదే జోనర్‌లో నాగార్జున 'అన్నమయ్య' చిత్రంలో నటించారు. ఆ సినిమా నాగార్జునకు ఎంతో గుర్తింపు తీసుకొచ్చింది. కానీ అంతకుమించిన అద్భుత నటనను ఈ సినిమాలో నాగార్జున కనబరిచారు. ఈ జనరేషన్‌కి ఈ చిత్రం ఓ సెన్సేషన్ అని చెప్పొచ్చు. రొమాంటిక్ హీరో ఇమేజ్ ఉన్న నాగార్జున ఈ తరహా భక్తి పాత్రలతో కూడా ఆకట్టుకోగలగడం విశేషం. దర్శకేంద్రుని మరో అద్భుత సృష్టే ఈ సినిమా అని చెప్పక తప్పదు. తిరుమల వేంకటేశ్వరుని కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించారు. తిరుమల సెట్స్ గానీ, పాత్రలూ, కథా కథనాలు గానీ ఎంతో చక్కగా కుదిరాయి ఈ సినిమాకి. ఈశ్వరమ్మగా అనుష్క కనబరిచిన హావభావాలు, నటన అందర్నీ ఆకట్టుకుంటోంది. అలాగే ముద్దుగుమ్మ ప్రగ్యా జైశ్వాల్ తన అందంతో ఈ సినిమాలో మరింత అందంగా కనిపించింది. ఇక శ్రీనివాసుడిగా బాలీవుడ్ నటుడు సౌరభ్‌ని ప్రశంసించకుండా ఉండలేము. మొత్తానికి నాగార్జున ఈ సంవత్సరం ఓ మంచి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. హథీరామ్ బాబాగా నాగార్జున నటన, అన్నమయ్యని మరపించింది. కీరవాణి నేపధ్య సంగీతం సినిమా చూస్తున్నంత సేపూ భక్తి పారవశ్యంలోకి తీసుకెళ్లేలా చేస్తోంది.