కోట్లాది ప్రజల ఆశ, ఆకాంక్ష నెరవేరింది. మన పాటకు... ఆస్కార్ దక్కింది. అవును.. ఆస్కార్ లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో పోటీ పడిన ఆర్.ఆర్.ఆర్‌లోని `నాటు నాటు` పాటకు ఆస్కార్ పురస్కారం దక్కింది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ తో పాటుగా పలు పురస్కారాలు అందుకొన్న `నాటు నాటు` గీతం.. ఇప్పుడు ఆస్కార్‌నీ గెలుచుకొంది.
కీరవాణి బీటుకి, చంద్రబోస్ మాటకీ, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ గళానికి తగిన ప్రతిఫలం దక్కింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెప్పులకు ప్రపంచమే ఊగిపోయింది. ఎక్కడ చూసినా ఇదే పాట... ఇవే స్టెప్పులు. అందుకే ఆస్కార్ జ్యూరీ కూడా.. నాటు నాటు పాటకే ఓటు వేసి గెలిపించింది. ఈ కేటగిరీలో అవార్డు సాధించిన తొలి భారతీయ చిత్రంగా ఆర్.ఆర్.ఆర్... నిలిచింది.
ఈ కేటగిరీలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 80పాటలు పోటీ పడ్డాయి. తుది జాబితాలో 15 చిత్రాలు చిలిచాయి. అయితే నామినేషన్ మాత్రం 5 పాటలకే దక్కింది. అప్పటి నుంచీ... నాటు నాటపై ఫోకస్ పడింది. దానికి తోడు రాజమౌళి టీమ్ కూడా ఆస్కార్ కోసం విస్కృతంగా ప్రచారం చేసింది. ఇవన్నీ ఫలించాయి.. ఈ పాటకు ఇప్పుడు ఆస్కార్ తో పట్టం కట్టారు. భారతీయులుగా, తెలుగువారిగా.. మనం గర్వించదగిన క్షణాలు ఇవి. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఆర్.ఆర్.ఆర్ టీమ్ కు... కంగ్రాట్స్ చెబుదామా...