రజనీకాంత్ .. రాజకీయాలు.. రెండూ విడదీయలేని విషయాలు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని, వస్తాడని.. ఆయన అభిమానులు ఆకాంక్షించారు. రజనీ కూడా.. తన సినిమాల్లో పొలిటికల్ స్పీచులు దంచి కొట్టేవాడు. వస్తా.. వస్తా.. అని ఊరించేవాడు. ఆమధ్య రజనీ రాజకీయ రంగ ప్రవేశం ఖాయం అనుకొన్నారంతా. పార్టీ ఏర్పాటు చేస్తానని రజనీ ప్రకటించడం, వెంటనే వెనక్కి తీసుకోవడం జరిగిపోయాయి. దాంతో రజనీ భయపడుతున్నారని అంతా అనుకొన్నారు. అయితే అనారోగ్య కారణాల వల్లే రజనీ రాజకీయాలకు దూరం అయ్యాడన్నది సన్నిహితుల మాట. ఇప్పుడు రజనీకాంత్ నోటి నుంచి కూడా అదే మాట బయటకు వచ్చింది.
చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో రజనీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజకీయాలకు సంబంధించిన టాపిక్ వచ్చింది. మూత్ర పిండాల్లో సమస్యలు తలెత్తడంతోనే రాజకీయాలకు దూరం అయ్యానిన, డాక్టర్లు బహిరంగ ప్రదేశాల్లో మీటింగులకు హాజరు కాకూడదన్న సలహా ఇచ్చినందున పార్టీ పెట్టలేకపోయాయని వ్యాఖ్యానించారు. కరోనా సమయంలో తాను ఆనారోగ్యానికి గురైనప్పుడు రాజకీయాల్లోకి వెళ్లొద్దు అని చాలామంది సలహా ఇచ్చారని గుర్తు చేసుకొన్నారు. ఈ విషయం బయటకు చెబితే తాను భయపడుతున్నట్టు మీడియా చిత్రీకరిస్తుందన్న అనుమానంతోనే ఇప్పటి వరకూ ఈ విషయాలేవీ ఎవరికీ చెప్పలేదన్నారు. రజనీకాంత్ వయసు 70 దాటింది. యువతరం చేతుల్లో దేశాన్ని పెట్టాల్సిన సమయం ఇది. అలాంటప్పుడు ఆయన రాజకీయాల్లోకి రావడం, ప్రజా సమస్యలపై పోరాడడం, అధికారం చేజిక్కించుకోవడం చాలా కష్టసాధ్యమైన విషయాలు. అందుకే రజనీ రాజకీయాల్లోకి రాలేకోపోయారు.