థియేటర్లకు అసలు సిసలైన ప్రత్యామ్నాయంగా మారింది `ఓటీటీ`. థియేటర్లు లేక, సినిమాల్ని విడుదల చేసుకోలేని పరిస్థితిలో విలవిలలాడుతున్న నిర్మాతలకు ఓటీటీ వేదికలు కల్పతరువులుగా కనిపించాయి. దాదాపు సినిమా బడ్జెట్ అంతా ఓటీటీ నుంచి రావడంతో కొంతమంది నిర్మాతలు ఓటీటీకి తమ సినిమాల్ని అమ్ముకున్నారు. కొత్త సినిమాలతో అమేజాన్ ప్రైమ్, ఆహా, జీ లాంటి ఓటీటీ వేదికలు కళకళలాడాయి. కాకపోతే.. అందులో హిట్ సినిమాల శాతమే చాలా తక్కువ. ఆ మాటకొస్తే.. ఓటీటీలో సినిమా అంటే ఫట్టే అనే సెంటిమెంట్ మొదలైంది. పెంగ్విన్ నుంచి వి వరకూ ఓటీటీలో విడుదలైన సినిమాలన్నీ ఫట్టుమన్నాయి. ఉమా మహేశ్వర ఉగ్రరూపశ్య, కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలు బాగున్నా - వాటికి మరీ అంత వ్యూవర్ షిప్ లభించలేదు.
అక్టోబరు 1న ఒరేయ్ బుజ్జిగా, అక్టోబరు 2న నిశ్శబ్దం సినిమాలు విడుదలయ్యాయి. ఒరేయ్ బుజ్జిగా ఎంటర్‌టైనర్ అయితే నిశ్శబ్దం ఓ థ్రిల్లర్. ఈ రెండు సినిమాలపైనా మంచి అంచనాలే ఉన్నాయి. ఒకటి ఆహాలో విడుదలైతే, రెండోది అమేజాన్ ప్రైమ్‌లో వచ్చింది. ఈ రెండు సినిమాల్లో ఒక్కటైనా హిట్ అవుతుందనుకున్నారంతా. రెండింటికి రెండూ బోల్తా కొట్టేశాయి ఇప్పుడు. దాంతో ఓటీటీ అంటే సినిమా ఫ్లాపే అనే సెంటిమెంట్ మరింత బలపడింది. ఇక మీదట సినిమాల్ని ఒకనేటప్పుడు ఓటీటీ సంస్థలు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాకపోతే.. ఓటీటీకి అమ్ముకున్న నిర్మాతలు సేఫ్ అయ్యారనే చెప్పాలి. ఇవే గనుక థియేటర్లో విడుదలైతే అద్దెలు కూడా వచ్చేవి కావు. ఓరకంగా... ఓటీటీ వల్ల నిర్మాతలు భారీ నష్టాల నుంచి తప్పించుకోగలిగారు.