దేశంలోని పలు రాష్ట్రాలు సినిమా థియేటర్‌లను అక్టోబర్ 1 నుంచి తెరిచేందుకు సమాయత్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ విషయమై ఇంకా ఎలాంటి స్పష్టతా లేదు. మరోపక్క, దసరా, దీపావళి సీజన్లకైనా థియేటర్లు అందుబాటులోకి వస్తే బావుంటుందనే భావన సినీ పరిశ్రమలో వుంది. ఎందుకంటే, ఈ రెండు సీజన్లను క్యాష్ చేసుకోగలిగితే, అది పరిశ్రమకు కొంత ఊరట అవుతుంది.
కానీ, థియేటర్లు తెరచుకున్నా ఆడియన్స్ ధైర్యంగా సినిమా హాళ్ళకు వెళ్ళే పరిస్థితి వుంటుందా.? లేదా.? అన్నదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. మరోపక్క, ఇప్పటికే ఓటీటీలో రిలీజ్ అయిపోయిన సినిమాలు, ఇంకోసారి థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయంటూ సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. తద్వారా థియేటర్లకు ప్రేక్షకులు ఎలా వస్తారు.? అన్నదానిపై ఓ స్పష్ట వస్తుందట సినీ పెద్దలకి. ఈ విషయమై ఇటు థియేటర్ల యాజమాన్యాలు, అటు సినీ పరిశ్రమ ప్రముఖుల మధ్య చర్చలు జోరుగా సాగుతున్నాయి. కరోనా సెకెండ్ వేవ్ వస్తే.. మళ్ళీ థియేటర్ల షట్ డౌన్ వుంటుందా.? అన్న ఆందోళన కూడా నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదలయ్యే అవకాశం లేదన్నది కొందరు సినీ ప్రముఖుల అభిప్రాయం.
అన్‌లాక్ ప్రక్రియలో వరుసగా వివిధ రంగాలకు వెసులుబాట్లు దొరుకుతున్న వేళ, సినీ పరిశ్రమకు పూర్తిస్థాయి వెసులుబాటు ఎప్పుడు దొరుకుతుందోగానీ.. పరిశ్రమ తిరిగి కోలుకోవడానికి మాత్రం చాలా సమయమే పట్టొచ్చు.