వరుసగా యువ దర్శకుల్ని లైన్ లో పెట్టేస్తున్నాడు నాని. ప్రస్తుతం శివ నిర్వాణతో `టక్ జగదీష్`లో నటిస్తున్నాడు నాని. ఆ వెంటనే రాహుల్ సంకీత్యన్ తో ఓ సినిమా ఉంది. వీటితో పాటు వివేక్ ఆత్రేయ కథకీ ఓకే చెప్పేశాడు. ఈ ముగ్గురూ యంగ్ డైరెక్టర్సే. ఇప్పుడు మరో యువ దర్శకుడితో సినిమా ఓకే చేసుకున్నాడు. తనే.. స్వరూప్.
`ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ`తో ఆకట్టుకున్నాడు స్వరూప్. చిన్న సినిమా అయినా.. భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాతో స్వరూప్ కి వరుస అవకాశాలు వచ్చాయి. అయితే నానితో సినిమా చేయాలని గట్టిగా ఫిక్సయి.. నానితో ప్రయాణం మొదలెట్టాడు. చివరికి స్వరూప్ చెప్పిన కథని నాని ఓకే చేసేశాడు. ఇది కూడా `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ`లా కాన్సెప్ట్ బేస్డ్ సినిమానే నట. 2021 చివర్లో ఈ సినిమా మొదలవుతుంది. మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.