'పద్మావత్'గా పేరు మార్చుకున్న 'పద్మావతి' సినిమాకి రిలీజ్ కష్టాలు తీరినట్లే కనిపించినా, ఇంకా తీరడం లేదు. ప్రత్యేక సమీక్షా కమిటీ ఆధ్వర్యంలో సెన్సార్ సర్టిఫికెట్ అందుకున్నా, కానీ విడుదల విషయంలో వివాదాలు ఇంకా తలెత్తుతూనే ఉన్నాయి.
ఇప్పటికే గుజరాత్, రాజస్థాన్ తదితర ఐదు రాష్ట్రాల్లో ఈ సినిమాని బ్యాన్ చేశారు. తాజాగా ఈ లిస్టులో హర్యానా రాష్ట్రం కూడా చేరింది. అయితే 'పద్మావత్'కి సంబంధించి తాజా అప్‌డేట్ ఏంటంటే, ఇంతవరకూ బ్యాన్ చేసిన ఐదు రాష్ట్రాలతో పాటు, దేశమంతా సినిమా విడుదలయ్యేలా ఆదేశాలివ్వాలంటూ, ఈ సినిమా నిర్మాణ సంస్థ కోర్టునాశ్రయించింది. వయాకామ్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ నెల 25న సినిమా విడుదల కావాల్సి ఉంది.
ఒక్కసారి సెన్సార్ అయ్యాక ఆ సినిమా విడుదలను అడ్డుకునే హక్కు ఎవ్వరికీ లేదని న్యాయస్థానానికి సినిమా నిర్మాత వయా కామ్ సంస్థ అధిపతి నివేదించారు. న్యాయస్థానం నుండి సానుకూల ఆదేశాలు వస్తాయని వయా కామ్ సంస్థ ఎదురు చూస్తోంది. ఇది నిజంగానే పెద్ద ట్విస్ట్ అని చెప్పాలి.
మామూలుగా సినిమా విడుదలను ఆపేయాలని కోరుతూ, కోర్టుకెక్కుతారు. కానీ 'పద్మావత్' విషయంలో అందుకు భిన్నంగా సినిమా రిలీజ్‌కి లైన్ క్లియర్ అయ్యేలా ఆదేశాలివ్వాంటూ కోర్టుకెళ్లడం విశేషంగా అనిపిస్తోంది. ఇప్పటికే సినిమా విడుదల ఆలస్యం కారణంగా తాము చాలా నష్టపోయామని నిర్మాత అంటున్నారు. చూడాలి మరి 'పద్మావత్' రిలీజ్ విషయంలో ఉన్నత న్యాయస్థానం సానుకూలంగా స్పందిస్తుందో లేదో!