బాలీవుడ్ సినిమా 'పద్మావతి' ఇంకోసారి రాజ్‌పుటానా కర్ని సేన ఆగ్రహానికి గురయ్యింది. జైపూర్‌లో సినిమా షూటింగ్ జరుగుతుండగా చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపై రాజ్‌పుటానా కర్ని సేన ప్రతినిథులు దాడి చేయడం గురించి గతంలో విన్నాం. తాజాగా ఈ దాడుల పరంపర మహారాష్ట్రకు పాకింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్ ప్రాంతంలో 'పద్మావతి' సినిమా కోసం సెట్ వేయగా, దాన్ని దుండగులు తగలబెట్టారు. ఈ ఘటనలో పలువుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి 10.30 నిమిషాల సమయంలో దాదాపు 50 మంది వ్యక్తులు పెట్రోల్ బాంబులు, రాళ్ళతో సెట్‌లోకి వెళ్ళి ఈ దాడి చేసినట్లుగా తెలియవస్తోంది. బాలీవుడ్ భామ దీపికా పడుకొనే ఈ సినిమాలో 'పద్మావతి' పాత్రలో కనిపించనుంది. రణ్‌వీర్‌సింగ్, షాహిద్‌కపూర్ ఈ చిత్రంలో ఇతర ప్రధాన తారాగణం. 'రాణి పద్మావతి' చరిత్రను కించపర్చేలా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారని రాజ్ పుటానా కర్ని సేన ఆరోపిస్తోంది. సినీరంగంలో ఇలాంటి దాడులు విచారకమైనవే. అయినా సినిమా అనేది వినోదం మాత్రమే. దాన్ని ఆ కోణంలో మాత్రమే చూడాలి. యదార్ధ ఘటనలు తెరకెక్కించినా కానీ, దాన్ని సినిమాగా మలచే కోణంలో కొంత కల్పితం కూడా ఉంటుంది. ఇతరుల మనోభావాలకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే, ఇలాంటి చారిత్రక నేపధ్యం ఉన్న చిత్రాలను తెరకెక్కించేటప్పుడు మరి కొంచెం జాగ్రత్త పడాల్సి ఉంటుంది.