గీత గోవిందం లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన తరవాత ఏ దర్శకుడూ ఖాళీగాఉండకూడదు. కానీ... పరశురామ్ మాత్రం ఏకంగా ఏడాది పాటు ఖాళీగా ఉన్నాడు. ఈలోగా మహేష్ బాబుతో సినిమా ఓకే అయ్యింది. కానీ దానికి సంబంధించి ఇప్పటి వరకూ ఒక్క ప్రకటన కూడా బయటకు రాలేదు. మహేష్ ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టేశాడన్న విషయం మాత్రం క్లియర్ అయ్యింది. ఇప్పుడు పరశురామ్‌కి మరో హీరో కావాలి. ఆ హీరో... ప్రభాస్ అని తెలుస్తోంది. ప్రభాస్ - పరశురామ్ మధ్య త్వరలోనే భేటీ జరగబోతోంది.
ఈ భేటీలో పరశురామ్ ప్రభాస్‌కి ఓ కథ చెప్పబోతున్నాడట. మహేష్ కోసం తయారు చేసుకున్న కథే ఇప్పుడు ప్రభాస్‌కి వినిపించబోతున్నాడని టాక్. ఒకవేళ పరశురామ్ చెప్పిన కథ నచ్చితే... 2020లోనే ఈ సినిమా మొదలయ్యే ఛాన్సుందని సమాచారం అందుతోంది. మరోవైపు ప్రభాస్ కోసం చాలామంది దర్శకులు కథలు పట్టుకుని రెడీగా ఉన్నారు. వాళ్లలో ఎవరి కథకి ప్రభాస్ ఓటేస్తాడో తెలీదు. ఏదేమైనా ప్రభాస్ కోసం వెయిట్ చేసే దర్శకుల జాబితాలో పరశురామ్ పేరు కూడా చేరిపోయినట్టే.