`సర్కారు వారి పాట` కలక్షన్ల మాట పక్కన పెడితే.. ఈ సినిమాలో చాలా లాజిక్ లెస్ సీన్లు కనిపిస్తాయి. అసలు ఈ కథ మహేష్ ఇమేజ్‌కే మ్యాచ్ కాలేదని, కేవలం మహేష్ గ్లామర్, తన స్టార్ డమ్ తోనే సినిమా లాక్కొచ్చాడని విమర్శకులు పెదవి విరిచారు. ఈ సినిమాపై అభిమానులూ అసంతృప్తిగానే ఉన్నారు. ఇందులో కొన్ని సీన్లు కుటుంబ ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు.
ముఖ్యంగా మహేష్ - కీర్తిల ఎపిసోడ్. మహేష్ .. కీర్తిపై కాలేసుకొని పడుకోవడం అనే సన్నివేశాల్ని ఓ ప్రహసనంలా తీర్చిదిద్దాడు పరశురామ్. ఆయా సన్నివేశాల కీర్తి సురేష్ పాత్రని డీగ్రీడ్ చేస్తున్నట్టు సాగాయి. సినిమాలో ఇదే పెద్ద మైనస్. ఈ విషయాన్ని పరశురామ్ దగ్గర ప్రస్తావిస్తే.. ``ఆ సన్నివేశాల్లో ఎలాంటి అభ్యంతరం నాకు కనిపించలేదు. ఓ కొడుకు తన తల్లిపై కాలేసుకుని పడుకుంటాడు కదా. అలాంటి సందర్భమే అది..`` అని వెనకేసుకొచ్చాడు. ప్రతీ దర్శకుడికీ తాను రాసిన సన్నివేశంపై ప్రేమ, అభిమానం, వాత్స్యల్యం ఉంటాయి. అంత మాత్రన.. అందరూ విమర్శిస్తున్న సన్నివేశాన్ని పట్టుకొని.. ఓ కొడుకు - అమ్మతో పోల్చడం ఆశ్యర్యాన్ని కలిగిస్తోంది. ``కొంతమందికి నచ్చలేదు కానీ.. చాలామందికి నచ్చింది. మాస్ కోసమే అలాంటి సీన్ పెట్టా`` అని చెబితే సరిపోయేదాన్నికి.. తల్లీ కొడుకుల పోలిక తెచ్చి పెట్టాడు పరశురామ్. అది కాస్త ఎబ్బెట్టు వ్యవహారంలా తయారైపోయిందిప్పుడు.