ఇద్దరు ముద్దుగుమ్మల మధ్యలో ఓ మగాడు నలిగిపోవడం అనే కాన్సెప్ట్‌తో చాలానే సినిమాలొచ్చాయి. చాలా వరకూ విజయవంతమయ్యాయి కూడా. అంతెందుకు ఇటీవల అజయ్ దేవగణ్, టబు, రకుల్ ప్రీత్‌సింగ్ ప్రధాన పాత్రల్లో 'దేదే ప్యార్ దే' సినిమా ఆకట్టుకుంది. సక్సెస్‌నా.? ఫెయిల్యూర్‌నా.? అనే విషయం పక్కన పెడితే, ఈ కాన్సెప్ట్‌ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారనడం అతిశయోక్తి కాదు. తెలుగులోనూ నాటి హీరోలు శోభన్‌బాబు, ఆ తర్వాతి తరం వెంకటేష్, నేటి తరం యంగ్ హీరోలు.. ఇలా చాలా మందే ఈ కాన్సెప్ట్ మూవీస్‌లో నటించి మెప్పించారు.
అయితే అప్పటి రోజులు వేరు. ఇప్పటి రోజులు వేరు. సినిమాని ఎలా పడితే అలా తెరకెక్కించేస్తే కుదరదు. ఎందుకంటే, ఎవరి మనోభావాలు ఎప్పుడు, ఎలా దెబ్బ తింటాయో ఎవరికీ తెలీదు. తాజాగా బాలీవుడ్‌లో 'పతీ పత్నీ ఔర్ ఓ' అనే మూవీ వివాదాల్లో పడింది. కారణం మనోభావాలు దెబ్బ తినడమే. ఇంతకీ ఎవరి మనోభావాలు.? ఎందుకు.? అంటే, 'వైవాహిక అత్యాచారం' అనే ఓ పేరు పెట్టారు. కార్తిక్ ఆర్యన్, భూమి పడ్నేకర్, అనన్యా పాండే ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది.
లేటెస్ట్‌గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌లో హీరో వైవాహిక బంధం గురించి చెప్పే డైలాగులు వివాదాస్పదమయ్యాయి. దాంతో సినిమా వివాదాల్లో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ భూమి పడ్నేకర్ క్షమాపణలు చెబుతూ సోషల్ మీడియాలో స్పందించింది. ఎవరి మనోభావాల్ని దెబ్బ తీయాలనుకోవడం లేదని, సినిమాని కేవలం వినోదాత్మక సాధనంగా మాత్రమే చూడాలని కోరింది.