పవన్ కల్యాణ్‌కి ఫ్యాన్స్ లేరు. ఫాలోవర్సే ఉన్నారు. పవన్ ని వాళ్లు ఎంతగా అభిమానిస్తారంటే, దానికి లాజిక్కే అవసరం లేదు. ఈ విషయం ఇప్పుడు మరోసారి నిరూపితమైంది.
ఎస్.ఎస్.రాజమౌళిపై పవన్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్ సినిమాని ఆర్.ఆర్.ఆర్ కోసం వాయిదా వేసినా, పవన్ త్యాగాన్ని రాజమౌళి పెద్దగా పట్టించుకోలేదని, తాను వేసిన ట్వీట్ లో ముందు మహేష్ పేరు ప్రస్తావించి, చివర్లో పవన్ పేరు పేర్కొన్నాడన్నది కోపం.
వాళ్ల కోపానికి ఓ అర్థం ఉంది. ఎందుకంటే, సర్కారు వారి పాట ఎప్పుడో వాయిదా వేశారు. కేవం ఆర్.ఆర్.ఆర్ కోసం వాయిదా వేసిన సినిమా భీమ్లా నాయక్. అయినా సరే, మహేష్ ని మొదట గుర్తు చేసుకుంటూ, ఆ తరవాత పవన్ దగ్గరకు వచ్చాడు రాజమౌళి. అందుకే రాజమౌళిపై కోపం. ఎస్.ఎస్.ఆర్ (ఎస్.ఎస్. రాజమౌళి)ని ట్రోల్ చేస్తూ.. పవన్ ఫ్యాన్స్ సోసల్ మీడియాలో వీరంగం చేస్తున్నారు. అయితే ఎస్.ఎస్.ఆర్ పేరుని ట్రోల్ చేయడం వల్ల నాని సినిమా బలైపోతోంది. అది ఎందుకు అంటే.. ఎస్.ఎస్.ఆర్ అంటే శ్యామ్ సింగరాయ్ కూడా. ఆ సినిమాని షార్ట్ కట్ లో అలా పిలుచుకుంటున్నారు. ఎస్.ఎస్.ఆర్ (శ్యామ్ సింగరాయ్) ఉన్నందుకు... నాని సినిమా చూడొద్దంటూ.. పవన్ ఫ్యాన్స్ మెసేజీలు పంపుకుంటున్నారు. ఇదేం లాజిక్కో అర్థం కావడం లేదు. వాళ్ల కోపం రాజమౌళిపై గానీ, నాని ఏం చేశాడని? ఈ ఎఫెక్టు నాని సినిమాపై ఎంత వరకూ పడుతుందో చూడాలి.