పవన్ కల్యాణ్‌ని ఏమైనా అంటే అభిమానులు ఊరుకోరు. సోషల్ మీడియా వేదికగా తమ ప్రతాపం చూపిస్తుంటారు. అయితే అదే పవన్ కి తలనొప్పిగా మారుతుంటుంది. ఈ మితిమీరిన అభిమానంతో తన ఇమేజ్ డామేజ్ అవుతుంది. అందుకే కొన్ని సందర్భాల్లో వవన్ తన అభిమానులకు దిశానిర్దేశం చేయాల్సివస్తుంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భాషని నిర్లక్ష్యం చేస్తుందన్న ఉద్దేశంతో పవన్ కల్యాణ్ జగన్‌పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి ప్రతిగా జగన్ కూడా స్పందించారు. మీ ముగ్గురు పెళ్లాలు - వాళ్ల పిల్లలూ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దాంతో... పవన్ అభిమానుల్ని గిల్లినట్టైంది. దీనిపై పవన్ ఇప్పటి వరకూ ఏం మాట్లాడలేదు. అభిమానుల్ని కూడా మాట్లాడొద్దని సూచించారు.
సోషల్ మీడియాలో రెచ్చిపోయి ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని, ఈ విషయంపై తానే స్వయంగా స్పందిస్తానని, ఇసుక కార్మికులకు మద్దతుగా పోరాటం చేస్తున్న ఈ సమయంలో సమస్యని తప్పుదోవ పట్టించడానికే ఇలా జగన్ స్పందించారని, ఇలాంటి సున్నితమైన విషయాల్లో ఆచి తూచి వ్యవహరించాలని జనసేన పార్టీ కోరుకుంటోంది. త్వరలోనే విజయవాడ, విశాఖపట్నం లలో పవన్ పర్యటించనున్నారని, అక్కడ జగన్ వ్యాఖ్యలపై కౌంటర్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.