పవన్ కళ్యాణ్ ప్రజాయాత్రకు ఆరంభం అదిరింది. భార్య అన్నా లెజినోవాతో వీర తిలకం దిద్దించుకుని, ఆంజనేయస్వామి దర్శనార్ధం కొండగుట్టకు బయలుదేరిన పవన్ కళ్యాణ్ స్వామి దర్శనం అనంతరం ఈ రోజు ప్రజా యాత్రలో పాల్గొననున్నారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధికి బయలుదేరిన పవన్, మద్యాహ్నం 2 గంటల సమయంలో ఆక్కడికి చేరుకుని, స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి, అక్కడకు వచ్చిన అభిమానులకు పవన్ అభివాదం చేశారు. కొందరు అభిమానులు పవన్ కోసం కొన్ని బహుమతులందించగా, వాటిని ప్రేమతో స్వీకరించారు. అభిమానులకు శిరసు వంచి నమస్కారాలు చేశారు.
పెద్ద ఎత్తున పవన్‌ని చూసేందుకు కొండగట్టుకు అభిమానులు హాజరయ్యారు. కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అంటూ అభిమానులు నినాదాలు చేశారు. అయితే 'జనసేన' కార్యకర్తలు మాత్రం పవన్ కళ్యాణ్ ప్రజాయాత్రను రాజకీయం చేయొద్దనీ, ప్రజారాజ్యం పార్టీ ప్రచారం సమయంలో ఆయనకు జరిగిన యాక్సిడెంట్ నుండి తృటిలో తప్పించుకున్న నేపథ్యంలో, స్వామి మొక్కుబడి తీర్చుకునేందుకే ఆయన కొండగట్టును వచ్చారనీ అంటున్నారు. దాంతో పాటు ప్రజా సమస్యలు తెలుసుకునేందుకుగాను పవన్ ఈ యాత్ర చేపట్టారనీ అంటున్నారు.
అయితే రాబోయే ఎన్నికల నిమిత్తం, పవన్ కళ్యాణ్ రాజకీయంగా నిలదొక్కుకునేందుకే, పక్కా వ్యూహంతోనే ఈ యాత్రకు శ్రీకారం చుట్టారనీ మరికొందరు అంటున్నారు. 'ఛలోరే చల్..' టైటిల్‌తో ఈ ప్రజా యాత్ర ప్రారంభమైంది. వరంగల్‌లో నాలుగు రోజుల పాటు, పవన్ ఈ ప్రజాయాత్రలో భాగంగా ప్రజలతో భేటీ కానున్నారు.