సినిమా అంటే వినోదమే. అయితే.. అదొక్కటే సరిపోవడం లేదు. ఏదో ఓ బలమైన పాయింట్ చెప్పాలి. పాన్ ఇండియా మంత్రం జపించడం మొదలెట్టాక... ఆ పాయింట్ ఇంకాస్త బలంగా ఉండి తీరాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే కమర్షియల్ సినిమాలన్నీ సందేశంతో ముడి పడి వస్తున్నాయి. పవన్ కల్యాణ్ సినిమా కోసం హరీష్ శంకర్ అదే చేస్తున్నాడు. పవన్ కల్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన కథ ఎప్పుడో సిద్ధమైంది. గబ్బర్ సింగ్ ని కేవలం ఎంటర్ టైన్‌మెంట్ తో నింపేసిన హరీష్.. ఈసారి ఎంటర్‌టైన్‌మెంట్ కి తోడుగా బలమైన పాయింట్ కూడా రాసుకున్నాడట. విద్యా వ్యవస్థలోని లోపాల్ని ఎత్తి చూపుతూ కొన్ని సన్నివేశాలు సాగబోతున్నాయట. పవన్ నుంచి ఇలాంటి కథ రావడం.. కొత్తగానే ఉంటుంది.
అయితే సరిగ్గా ఇదే పాయింట్ తో ధనుష్ ఓ సినిమా చేస్తున్నాడని సమాచారం. తమిళ స్టార్ ధనుష్ ఈమధ్య టాలీవుడ్ పై దృష్టి పెట్టాడు. శేఖర్ కమ్ములతో ఓ సినిమా చేస్తున్నాడు. వెంకీ అట్లూరి చెప్పిన కథకూ ఓకే చెప్పినట్టు టాలీవుడ్ టాక్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాని నిర్మించనుంది. ఇది కూడా విద్యావ్యవస్థ చుట్టూ నడిచే కథ అట. అంటే పవన్, ధనుష్ ఇద్దరూ ఒకే పాయింట్ పట్టుకున్నారన్నమాట. కాకపోతే ఎవరి స్టైల్ లో వాళ్లు చెబుతారు. ఈ రెండు కథల్లో.. ఎవరి కథ.. సూటిగా జనంలోకి వెళ్తుందో చూడాలి.