సౌత్ ఇండియన్ సినిమా పవరేంటో బాలీవుడ్ కి రుచి చూపించిన సినిమా... పుష్ప. ఇప్పటికీ పుష్ప మానియా.. బాలీవుడ్ లో అక్కడక్కడ కనిపిస్తూనే ఉంది. తగ్గేదేలే.. అంటూ బన్నీ మేనరిజాల్ని బాలీవుడ్ హీరోలు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన క్రికెటర్లు ఇమిటేట్ చేయడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అందరి దృష్టీ పుష్ప 2నైనే పడింది. పుష్పని సూపర్ హిట్ చేసిన సుకుమార్... ఇప్పుడు అంతకు మించి పుష్ప 2ని మలచాలన్న ప్రయత్నాల్లో నిమిగ్నమై ఉన్నాడు.
పుష్ప 2 గురించి బోలెడన్ని రూమర్లు.. కథలు. కేజీఎఫ్ 2 ఎఫెక్ట్ తో పుష్ప 2 బడ్జెట్ పెంచేశారని, యాక్షన్ సన్నివేశాల్ని దట్టంగా రాసుకొన్నారని వార్తలొస్తూనే ఉన్నాయి. కేజీఎఫ్ లో అమ్మ సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయ్యింది. అందుకే ఈ సినిమాలోనూ అమ్మ సెంటిమెంటగ్ ని దట్టించారని చెప్పుకొంటున్నారు. ఇప్పుడు మరో వార్త బయటకు వచ్చింది. పుష్ప జీవితంలో శ్రీవల్లిది కీలకమైన పాత్ర. ఆ పాత్రలో... రష్మిక ఒదిగిపోయింది. పుష్ప - శ్రీవల్లీ కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. పార్ట్ 2లో వీళ్ల కెమిస్ట్రీ చూపించే వీలు లేదు. ఎందుకంటే.. పార్ట్ 1లోనే వీళ్ల పెళ్లి అయిపోయింది. పార్ట్ 2 లో సంసార జీవితం చూపించాలి. అయితే ఇక్కడే సుకుమార్ ఓ మాస్టర్ ప్లాన్ వేశాడట. పార్ట్ 2లో శ్రీవల్లీ పాత్రని చంపేశాడట. విలన్ల చేతులో శ్రీవల్లీ చనిపోతుందని, దానిపై హీరో ప్రతీకారం తీర్చుకోవడంతోనే పార్ట్ 2 కథ ముగుస్తుందని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇదెంత వరకూ నిజమో తెలీదు గానీ, హీరోయిన్ ని చంపడం, దానిపై హీరో ప్రతీకారం తీర్చుకోవడం మాత్రం పక్కా ఓల్డ్ ఫార్ములా. అయినా సరే.. సుకుమార్ తీస్తున్నాడు కాబట్టి ఏదో ఓ మ్యాజిక్ చేయొచ్చు. ఒకవేళ శ్రీవల్లీ పాత్రకి ఇక్కడితో ముగింపు పలకాలనుకొంటే మాత్రం.. పుష్ప జర్నీకి కూడా ఇదే ముగింపు అవుతుంది. ఎందుకంటే.. పార్ట్ 3 కూడా ఉంటుందని చాలామంది ఆశ. శ్రీవల్లీ లేకుండా పుష్ప ని ఊహించడం కష్టం. కాబట్టి.. పుష్ప కూడా రెండు భాగాలకే పరిమితం అనుకోవాలి.