సినిమా సినిమానే. రాజకీయాలు రాజకీయాలే. కలిసి నటిస్తున్నంత మాత్రాన... రాజకీయంగానూ మద్దతు ఇవ్వాలని లేదు. అందుకే.. సినిమా నటులు రాజకీయాల్లోకి వచ్చాక.. పరస్పరం విభేదించుకోవడం మొదలెడతారు. తాజాగా... పవన్ కల్యాణ్ - ప్రకాష్ రాజ్ మధ్య అదే జరిగింది. పవన్ తాజా రాజకీయ నిర్ణయాలపై ప్రకాశ్ రాజ్ మండి పడుతున్నారు. పవన్ వి స్థిరత్వం లేని నిర్ణయాలని, ఆయన ఊసరవెల్లి లా మారిపోయారని కాస్త ఘాటైన వ్యాఖ్యలే చేశారు.
ఇటీవల జనసేన బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం.. పవన్.. బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ``పవన్ కల్యాణ్ అందరినీ నిరాశపర్చాడు. ఈ విషయం చెప్తున్నందుకు క్షమించండి. తాను లీడర్ ను కాదన్నట్టుగా పవన్ తనకు తాను అనుకుంటున్నారు. గత సాధారణ ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి వచ్చిన ఓటింగ్ శాతం ఎంత వచ్చిందో తెలియదా..? మీరు ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఎందుకు వెళ్తున్నారు? 2014లో పవన్ ఎన్డీఏ తరుపున ప్రచారం చేస్తూ..మోదీని గొప్ప వ్యక్తి అంటూ కొనియాడారు. కానీ 2019లో ఆ మాటలు పక్కన పెట్టి లెఫ్ట్ పార్టీలతో కలిసి వెళ్లి..మోదీ, టీడీపీని విమర్శించారు. ఇక 2020 లో మళ్లీ బీజేపీతో కలిసి ముందుకొస్తున్నారు. పవన్ కల్యాణ్ ఓ ఊసరవెళ్లి తప్ప మరొకటి కాదని ప‌్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు. పవన్‌ని పల్లెత్తు మాట అన్నా.. ఆయన అభిమానులు ఊరుకోరు. మరి ప్రకాష్ రాజ్ వ్యాఖ్యల్ని వాళ్లు ఎలా తీసుకుంటారో?