పవన్ కల్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఓ సినిమాని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే.. `భవదీయుడు భగత్ సింగ్`. మైత్రీ మూవీస్ సంస్థ ఈ సినిమాని తెరకెక్కించాలి.
అయితే.. ప్రకటన వచ్చి ఇంత కాలమైనా, ఈ ప్రాజెక్టుపై ఎలాంటి అప్టేడ్ రాలేదు.ఈ సినిమా కోసం ఎదురు చూసీ, ఎదురు చూసీ హరీష్ శంకర్ కూడా విసిగిపోయాడని, పవన్ సినిమాని పక్కన పెట్టి, మరో ప్రాజెక్టులో లీనమైపోయాడని ఇటీవల వార్తలొచ్చాయి. దానికి తగ్గట్టుగానే హరీష్ కంటే తరువాతి ఒప్పుకొన్న సినిమాలన్నీ పవన్ పట్టాలెక్కిస్తున్నాడు గానీ, హరీష్ సినిమా మాత్రం ముట్టుకోవడం లేదు. దాంతో ఆ అనుమానాలు మరింత బలపడ్డాయి.
అయితే ఇప్పుడో ట్వీట్ పవన్ ఫ్యాన్స్ ఆశలు చిగురించేలా చేసింది. పవన్ కల్యాణ్ సినిమా ఎప్పుడు ఉంటుంది..? ఈసారి వింటేజ్ పవన్ కల్యాణ్‌నిచూపించాల్సిందే, డాన్సులు ఉండాల్సిందే.. అంటూ హరీష్ శంకర్ ని కోరుతూ.. ఓ అభిమాని ట్వీట్ చేశాడు. దానికి హరీష్ సమాధానం కూడా ఇచ్చాడు. ``మీకు కావాల్సినవి అన్నీ ఉంటాయి. ఏదీ మిస్ అవ్వదు. నన్ను నమ్మండి... ఈ ఎదురు చూపులకు తగిన ప్రతిఫలం దక్కుతుంది`` అని ఫ్యాన్స్‌కి మాటిచ్చాడు. అంటే.. ఈ కాంబో ఆగిపోలేదన్నమాట. తప్పకుండా ఈ సినిమా ఉంటుంది. అది కూడా పవన్ ఫ్యాన్స్‌కి నచ్చేలా ఉంటుంది. కానీ అదెప్పుడన్నదే పెద్ద ప్రశ్న. దీనికి త్వరలోనే హరీష్ క్లారిటీ ఇస్తే బాగుంటుంది.