పవన్ కల్యాణ్‌కి అన్ని శాఖల్లోనూ ప్రవేశం ఉంది. తను కథకుడు. నిర్మాత. గాయకుడు. కొన్ని సినిమాలకు కొరియోగ్రఫీ కూడా చేశాడు. అందుకే దర్శకుడిగా మారాడు. పవన్ దర్శకత్వంలో `జానీ` సినిమా వస్తుందని తెలియగానే... అభిమానుల ఆనందానికి, అంచనాలకూ అవధుల్లేకుండా పోయింది. కర్చీఫ్ పై జానీ అనే అక్షరాలు రాయించుకుని తిరగడం అప్పట్లో అబ్బాయిలకు ఓ ఫ్యాషన్ గా మారింది. ఈసినిమా కోసం పవన్ బరువు తగ్గాడు. చాలా కష్టపడ్డాడు. పాటలు సూపర్ డూపర్ హిట్. కానీ సినిమా పోయింది. కారణం.. పవన్ అభిమానుల అంచనాలకు భిన్నంగా ఉండడమే.
ఖుషీ లాంటి సూపర్ హిట్ తరవాత అంత గ్యాప్ తీసుకుని, తన డైరక్షన్ లో ఓసినిమా చేస్తుంటే... కచ్చితంగా అది ఖుషీలాంటి లవ్ ఎంటర్‌టైనర్ అనుకుంటారు. కానీ... దానికి భిన్నమైన సినిమా తీసి ఆశ్చర్యపరచాలనుకున్నాడు. అందుకే జానీ పోయింది. అలాగని అదేం చెత్త సినిమా కాదు. ఈ సినిమాలో పవన్ చాలా ప్రయోగాలు చేశాడు. సింక్ సౌండ్ అనే టెక్నిక్ ని టాలీవుడ్ కి పరిచయం చేశాడు పవన్. ఆ సినిమాలో పోరాట సన్నివేశాలు అత్యంత సహజంగా తీర్చిదిద్దాడు. వీటి వెనుక పవన్ శ్రమ కచ్చితంగా కనిపిస్తుంది.
జానీ చూస్తే పవన్ లోని ఓ బ్రిలియంట్ టెక్నీషియన్ కనిపిస్తాడని - విజయేంద్ర ప్రసాద్ లాంటి రచయితలు కితాబు ఇస్తుంటారు. ఇండ్రస్ట్రీలోని పవన్ అభిమానులకు జానీ అంటే చాలా ఇష్టం కూడా. జానీ సినిమా ఫ్లాప్ అవ్వడంతో బయ్యర్లు బాగా నష్టపోయారు. వాళ్లందరినీ ఆఫీసుకి పిలిచి - డబ్బులు వెనక్కి ఇప్పించాడు పవన్ కల్యాణ్. అప్పట్లో పవన్ ఇలా.. బయ్యర్లకు డబ్బులు ఇవ్వడం టాక్ ఆఫ్ ది ఇండ్రస్ట్రీ అయ్యింది. మరెంతోమంది హీరోలకు ఆదర్శప్రాయంగా నిలిచిన సంఘటన అది. జానీ ఎఫెక్టో ఏమో.. పవన్ మళ్లీ దర్శకత్వం వైపు అడుగు పెట్టలేదు.