జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తిరిగి సినిమాల్లోకి రావడమే ఓ ఆశ్చర్యం. అలాంటిది, ఎడా పెడా కొత్త సినిమాల్ని అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకేమన్నా వుందా.! అసలు వీటిల్లో ఎన్ని సినిమాలు పట్టాలెక్కుతాయి.? ఎన్ని విడుదలకు నోచుకోకుండా ఆగిపోతాయి.? అన్న అనుమానాలు తెరపైకొచ్చాయి. కారణం, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా వుండడమే. అయితే, సినిమా వేరు - రాజకీయం వేరు.. పవన్ కళ్యాణ్ కమిట్‌మెంట్ ఏంటో అన్నయ్య చిరంజీవికే బాగా తెలుసు. ‘నాకు కుదరలేదు.. కానీ, నా తమ్ముడు నాలా కాదు.. రెండు పడవల మీద భేషుగ్గా ప్రయాణం చేయగలడు’ అని చెప్పారు గతంలోనే. అదిప్పుడు నిజమవుతోంది.
కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో కొంత కాలం బ్రేక్ తీసుకున్న పవన్, సినిమాల్లో యాక్టివ్ అయ్యారు. ‘వకీల్‌సాబ్’ సినిమా షూటింగ్‌లో బిజీగా వున్నారు. పవన్ కొత్త గెటప్ ఇప్పుడందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పవన్ ఆటిట్యూడ్‌లో ఏమాత్రం మార్పు రాలేదు. పవన్ జోష్‌లో కూడా ఏమాత్రం మార్పు లేకపోవడంతో అభిమానుల ఆనందానికి ఆకాశమే హద్దు అన్నట్టుంది పరిస్థితి.
‘వకీల్‌సాబ్’ని త్వరగా పూర్తి చేసేసి, క్రిష్ డైరెక్షన్‌లో సినిమాపై దృష్టిపెట్టబోతున్నాడు పవన్. ఆ తర్వాత, వరుసగా హరీష్ శంకర్ తదితరుల సినిమాల్ని పట్టాలెక్కించబోతున్నాడు. సో, ఇకపై ‘పవర్’ జాతరేనన్నమాట పవన్ కళ్యాణ్ అభిమానులకి. అన్నట్టు, సొంత బ్యానర్‌లో ఓ టాలెంటెడ్ డైరెక్టర్‌తో ఓ సినిమా చేయాలనే ఆలోచనతో కూడా పవన్ వున్నట్లు తెలుస్తోంది.